Pakistan: పారా గ్లైడింగ్ చేస్తూ జనాల మీదికి దూసుకొచ్చిన పాకిస్థాన్ కమాండో... వీడియో ఇదిగో!

  • గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో పాక్ సైన్యం పారా గ్లైడింగ్
  • విన్యాసాల్లో పాల్గొన్న పాక్ ఎస్ఎస్ జీ ఎలైట్ కమాండోలు
  • ఓ పారాచ్యూట్ ను నియంత్రించలేకపోయిన కమాండో
  • కార్యక్రమానికి విచ్చేసిన వారికి గాయాలు
Pakistan commando rams into audience during a paragliding show

దేశ విభజన జరిగాక కాలక్రమంలో భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగితే, పాకిస్థాన్ అంతకంతకు కునారిల్లుతోంది. ఏదేమైనా భారత్ కు దీటుగా నిలవాలన్నది పాక్ తాపత్రయం. కానీ ఆ దేశం ఏ విధంగా భంగపడుతుంటుందో అప్పుడుప్పుడు కొన్ని సంఘటనలు చెబుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. 

భారత్ కు పోటీనిచ్చే సైనిక శక్తిని సముపార్జించుకోవాలన్నది పాక్ లక్ష్యాల్లో ఒకటి! కానీ, ఈ వీడియో చూస్తే... భారత సైన్యానికి పాక్ దరిదాపుల్లో కూడా ఉండదన్న విషయం స్పష్టమవుతుంది. గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు పారా గ్లైడింగ్ విన్యాసాలు చేపట్టారు. ఈ విన్యాసాలు చూసేందుకు ప్రముఖులు, ప్రజలు విచ్చేశారు. 

అయితే, ఓ పాకిస్థాన్ కమాండో పారా గ్లైడింగ్ చేస్తూ మైదానంలో దిగేందుకు బదులు, విన్యాసాలను తిలకిస్తున్న ప్రముఖుల గ్యాలరీలోకి దూసుకొచ్చాడు. దాంతో కొందరు భయంతో పక్కకి దూకేశారు. కొందరు మాత్రం గాయాలపాలయ్యారు.  

పాకిస్థాన్ సైన్యంలోని అత్యుత్తమ స్థాయి కమాండో బృందం అయిన ఎస్ఎస్ జీ యోధుల పరిస్థితే ఇలా ఉంటే, సాధారణ సైనికులు ఇంకెంత ఘనులో అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

వీళ్ల కంటే హమాస్ మిలిటెంట్లు నయం... పారా గ్లైడింగ్ చక్కగా చేస్తారు అంటూ ఓ నెటిజన్ ఎత్తిపొడిచాడు. బహుశా అవి చైనా పారాచ్యూట్లు అయ్యుంటాయి అని మరో వ్యక్తి కామెంట్ చేయగా... వీళ్లు అత్యుత్తమ కమాండోలు ఏంట్రా బాబూ అంటూ ఇంకో నెటిజన్ విమర్శించాడు.

More Telugu News