Sachin Tendulkar: డ్రెస్సింగ్ రూం మెడల్ సెర్మనీలో టీమిండియాకు సర్ ప్రైజ్... వీడియో ఇదిగో!

  • నిన్న శ్రీలంకను భారీ తేడాతో ఓడించిన టీమిండియా
  • బెస్ట్ అనదగ్గ రీతిలో క్యాచ్ పట్టిన శ్రేయాస్ అయ్యర్
  • వీడియో సందేశం ద్వారా అయ్యర్ పేరును ప్రకటించిన సచిన్ టెండూల్కర్
Surprise in Team India dressing room medal ceremony

సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా ఎదురున్నదే లేకుండా దూసుకుపోతోంది. గురువారం నాడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో అత్యంత ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో బౌలర్లు విజృంభిస్తే, ఫీల్డర్లు అద్భుతం అనదగ్గ రీతిలో కొన్ని క్యాచ్ లు అందుకున్నారు. 

కాగా, వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా ప్రతి మ్యాచ్ లోనూ ఉత్తమ క్యాచ్ పట్టిన ఆటగాడిని మ్యాచ్ ముగిశాక మెడల్ తో సత్కరిస్తోంది. నిన్న కూడా అదే ఆనవాయతీ కొనసాగించింది. అయితే, ఓ విశిష్ట వ్యక్తి ఎంట్రీ ఇచ్చి, శ్రీలంకతో పోరులో టీమిండియా బెస్ట్ ఫీల్డర్ ఎవరో చెప్పారు. ఆ విశిష్ట వ్యక్తి ఎవరో కాదు... భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోరిక మేరకు సచిన్ జాతీయ జట్టు కోసం కాస్త సమయం కేటాయించాడు. ఈ సందర్భంగా సచిన్ ఓ వీడియో సందేశాన్ని పంపాడు. ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న తీరు చూస్తుంటే తనకు 2003 వరల్డ్ కప్ నాటి రోజులు గుర్తొస్తున్నాయని తెలిపాడు. ఇప్పుడు మ్యాచ్ ముగిశాక బెస్ట్ ఫీల్డర్ సెర్మనీ జరుపుతున్నారని, నాడు తాము మ్యాచ్ కు ముందు ఓ చార్ట్ పై టిక్ చేసి వెళ్లేవారమని సచిన్ పేర్కొన్నాడు. 

ఐ కెన్, వుయ్ కెన్ పేరిట ఆ చార్ట్ పై రెండు కాలమ్స్ ఉండేవని, వాటిని ప్రతి ఆటగాడు టిక్ చేసి మైదానంలో దిగేవాడని వెల్లడించాడు. దానర్థం... దేశం కోసం, జట్టు కోసం, సహచరుల కోసం తాను 100 శాతం ఆటతీరు ప్రదర్శిస్తానని ప్రతి ఆటగాడు చాటి చెప్పడమేనని సచిన్ వివరించాడు. నా జట్టు కోసం నేను రాణిస్తాను అనేది అంతిమంగా ఆ చార్ట్ ఉద్దేశమని స్పష్టం చేశాడు. 

ప్రస్తుతం టీమిండియా దేశం కోసం చూపిస్తున్న అంకితభావం, క్రికెట్ బ్రాండ్ ను ఆటగాళ్లు ముందుకు తీసుకెళుతున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని వెల్లడించాడు. ఈ వరల్డ్ కప్ లో భారత జట్టు ఆటతీరును తిలకించడం ఎంతో ఆనందం కలిగిస్తోందని తెలిపాడు. 

"అబ్బాయిలూ... ఇదే ఫామ్ ను కొనసాగించండి... ఇంతకంటే నేను ఇంకేమీ ఎక్కువగా చెప్పను. మైదానంలోకి దిగి మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి" అంటూ తన సందేశం వెలువరించాడు. 

అంతేకాదు, శ్రీలంకతో మ్యాచ్ లో బెస్ట్ ఫీల్డర్ ఎవరో కూడా సచిన్ చెప్పేశాడు. శ్రేయాస్ అయ్యర్ అంటూ పేరును అనౌన్స్ చేశాడు. దాంతో టీమిండియా సభ్యులు హర్షాతిరేకాలతో డ్రెస్సింగ్ రూమ్ ను హోరెత్తించాడు. అనంతరం శ్రేయాస్ అయ్యర్ కు కేఎల్ రాహుల్ మెడల్ ప్రదానం చేశాడు. తమ కోసం సమయం కేటాయించినందుకు సచిన్ కు కెప్టెన్ రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన వెబ్ సైట్ లో పంచుకుంది.

More Telugu News