USA: యూఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్!.. భారీగా తగ్గిన వెయిటింగ్ టైమ్!

Good news for those who are waiting for US visa interview
  • 2.5 లక్షల నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్లు ఓపెన్
  • పలు నగరాల్లో భారీగా తగ్గిన వెయిటింగ్ సమయం
  • ఎక్స్ వేదికగా ప్రకటించిన అమెరికా రాయబార కార్యాలయం
అగ్రరాజ్యం అమెరికా వీసా ఇంటర్వ్యూ కోసం సాధారణంగా చాలా ఎక్కువ సమయం నిరీక్షించాల్సి ఉంటుంది. అయితే అలా ఎదురుచూస్తున్న భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం గుడ్‌న్యూస్ చెప్పింది. వారాంతంలో 2.5 లక్షల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్లను ఓపెన్ చేసినట్టు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. తమ కాన్సులర్ బృందానికి ఇది బిజీ వారమని తెలిపింది. https://www.ustraveldocs.com/in/en పై అపాయింట్‌మెంట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది. ఫలితంగా నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసాలైన బీ1 (బిజినెస్), బీ2 (టూరిస్ట్) ఇంటర్వ్యూ కోసం వేచి చూసే సమయం భారీగా తగ్గింది.

ఢిల్లీలో గతవారం 542 రోజులుగా ఉన్న వెయిటింగ్ టైమ్ ఇప్పుడు 37 రోజులకు తగ్గింది. కోల్‌కతాలో 539 నుంచి 126 రోజులకు తగ్గింది. ముంబైలో 596 నుంచి 322 రోజులకు, చెన్నైలో 526 నుంచి 341 రోజులకు భారీగా తగ్గింది. అయితే ఇందుకు విరుద్ధంగా హైదరాబాద్‌ లో కొన్ని రోజులు అదనంగా పెరిగాయి. గతవారం వెయిటింగ్ సమయంలో 506 రోజులు ఉండగా ఇప్పుడది 511 రోజులకు పెరగడం గమనార్హం. ఇదిలావుండగా ఈ ఏడాది అమెరికా, భారతీయులకు సంబంధించిన 10 లక్షలకు పైగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. కరోనా ముందు కంటే ఇది 20 శాతం ఎక్కువని ఎంబసీ అధికారులు తెలిపారు.
USA
India

More Telugu News