Revanth Reddy: కేసీఆర్‌ను కొట్టాలంటే మరో కేసీఆర్ పుట్టాల్సిందే.. ఎవరితరం కాదు: ఎమ్మెల్సీ కవిత

  • బోధన్‌లో మహా యువగర్జనలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
  • కాంగ్రెస్ హయాంలో 10వేల ఉద్యోగాలిస్తే మేం లక్షా 60వేలు భర్తీ చేశామన్న కవిత
  • తెలంగాణ మారాలంటే యువత నుంచి మార్పు రావాలన్న ఎమ్మెల్సీ
MLC Kavitha says no one can defeat kcr

రాజకీయంగా కేసీఆర్‌ను కొట్టాలంటే మరో కేసీఆరే పుట్టాలని, బీఆర్ఎస్‌ను ఓడించడం ఎవరి తరం కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌కు మద్దతుగా జరిగిన మహా యువగర్జన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీ పక్షాన యువగళం ఉందని చెప్పడానికి ఈ సభనే రుజువు అన్నారు. గులాబీ జెండా యువతకు అండగా ఉంటుందన్నారు. ఉద్యోగాల కల్పనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అలియాస్ రేటెంతరెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. 

2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కేవలం 24వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, అందులో తెలంగాణకు వచ్చిన ఉద్యోగాలు కేవలం 10వేలే అన్నారు. ఆ ఉద్యోగాలు కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చివరి రెండేళ్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏడాదికి సగటున వెయ్యి ఉద్యోగాలే వచ్చాయన్నారు. కానీ గత పదేళ్ల కేసీఆర్ పాలనలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, అందులో 1.60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసుకున్నామన్నారు. మరో 40వేల ఉద్యోగాల భర్తీ ఆయా దశల్లో ఉన్నాయన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేయగానే, పరీక్షలు పెట్టగానే, ఫలితాలు వెల్లడించగానే కాంగ్రెస్ నాయకులకు కోర్టుల్లో కేసులు వేయడం అలవాటుగా మారిందన్నారు. ప్రజలకు, యువతకు కలిగే ప్రయోజనాలను దొంగదారిలో అడ్డదారిలో ఆపాలని ప్రయత్నం చేయడం తప్ప కాంగ్రెస్ చేసిన మంచి ఏమీ లేదన్నారు.

తెలంగాణ మారాలంటే యువత మారాలని, మార్పు యువత నుంచే రావాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, రకరకాల రూపంలో ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తున్నాయన్నారు. రైతు బంధు, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలు కావాలని ఎవరైనా కేసీఆర్‌ను అడిగారా? ఇవన్నీ ఎందుకు చేశారు? ప్రజల కోసం ఆలోచించారన్నారు. కేసీఆర్ మనసు మహాసముద్రం, ఆలోచన ఆకాశమన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడగొట్టాలంటే మరో కేసీఆర్ పుట్టాలని, ఇతరులకు సాధ్యం కాదన్నారు. మూడోసారి కచ్చితంగా గులాబీ జెండా ఎగురుతుందన్నారు. కాంగ్రెస్‌లో వాళ్లు వాళ్లు కొట్టుకొని చావడానికే సమయం లేదని.. వాళ్లు ప్రజల గురించి ఆలోచించే సమయం ఎక్కడిదని అన్నారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డమీద కూలీలని రేవంత్ రెడ్డి మాట్లాడారని, రైతుబంధును బిచ్చమేస్తున్నామంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు.

  • Loading...

More Telugu News