KCR: తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిందే బీఆర్ఎస్: నిర్మల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్

  • మూడోసారి మీ ఆశీర్వాదం కోసం వచ్చానన్న కేసీఆర్
  • ఇంద్రకరణ్ రెడ్డిని 80వేల మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి
  • అభ్యర్థులు, పార్టీల మంచి చెడు చూసి ఓటేయాలని సూచన
CM KCR praja Ashirvada sabha in nirmal

తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం నిర్మల్‌లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు. రాష్ట్రం సిద్ధించాక రెండుసార్లు తెలంగాణ ప్రజలు తమను ఆశీర్వదించారని, రాష్ట్రాన్ని అన్నింటా ముందు నిలిపి మూడోసారి మీ ముందుకు వచ్చామన్నారు. నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపన పడ్డారని, తెలంగాణ రాకుంటే జిల్లా అయ్యేదా? అని ప్రశ్నించారు. జిల్లాకో మెడికల్ కాలేజీని నిర్మించుకున్నామన్నారు. ఇంద్రకరణ్ రెడ్డిని 80వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. దళితబంధు పథకాన్ని తెచ్చిందే బీఆర్ఎస్ అన్నారు.

ఇప్పటికే రైతు రుణమాఫీ కొంతమందికి చేశామని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మరికొంతమందికి పూర్తి చేయలేకపోయినట్లు చెప్పారు. రైతుకు సాయం చేయాలనే ఆలోచన గతంలో పాలించిన వారికి రాలేదన్నారు. రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారికి బుద్ధి చెప్పాలన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా పోతాయన్నారు. ఎన్నికలు వస్తాయి.. పోతాయి కానీ అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉందని, ఇది మీ తలరాతను లిఖిస్తుందన్నారు. అభ్యర్థుల మంచి చెడు చూసి ఓటేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఆగం కావొద్దన్నారు. తెలంగాణ నష్టపోవద్దని ఆలోచించే కాపలాదారు బీఆర్ఎస్ అన్నారు. నిర్మల్ చాలా అభివృద్ధి చెందిందని, ఇక్కడ జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పిస్తానన్నారు.

More Telugu News