k laxman: కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు వార్తలపై బీజేపీ నేత లక్ష్మణ్ ఏమన్నారంటే..!

  • వివేక్ పార్టీ మారనని చెప్పుకుంటూ వచ్చారని, ఎందుకు మారారో ఆయన్నే అడగాలన్న లక్ష్మణ్
  • ప్రజలు మాతో ఉన్నప్పుడు వ్యక్తులు పోయినంత మాత్రాన నష్టం లేదన్న బీజేపీ నేత
  • కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతు ఇస్తున్నట్లు ఎలాంటి ప్రకటన చేయలేదన్న లక్ష్మణ్
  • ఒకవేళ మద్దతిచ్చినా తెలంగాణ ప్రజలు వివేకవంతంగా ఆలోచిస్తారన్న బీజేపీ ఎంపీ
BJP Laxman responds on tdp support to congress

మాజీ ఎంపీ జి.వివేక్ బీజేపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి వివేక్ పార్టీ మారడంపై ప్రశ్నించారు. దీనికి లక్ష్మణ్ స్పందిస్తూ... వివేక్ పార్టీ మారనని చెబుతూనే కాంగ్రెస్‌లో చేరారని, తాము వ్యక్తిని నమ్మామని, ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలోనూ తాను పార్టీ మారేది లేదని, ఎంపీగా పోటీ చేయనున్నట్లు చెప్పారని గుర్తు చేశారు. కానీ అంతలోనే కాంగ్రెస్‌లో ఎందుకు చేరారు? అనేది ఆయననే అడగాలన్నారు.

తాము ప్రజల్ని విశ్వసిస్తామని, పార్టీ నుంచి అలాంటి వారు వెళ్లినంత మాత్రాన బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. వారు పోయినంత మాత్రాన మా క్యాడర్ పోతుందని లేదన్నారు. అయినా ప్రజలు బీజేపీతో ఉన్నప్పుడు వ్యక్తులు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. 

ఏపీలో జనసేన-టీడీపీ కలిసి ఉన్నాయని, ఇక్కడ మాత్రం అదే టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందని చెబుతున్నారని, దీనిని ఎలా చూస్తారు? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి లక్ష్మణ్ స్పందిస్తూ... టీడీపీ తెలంగాణలో పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో ఆ పార్టీనే చెప్పాలన్నారు. టీడీపీ తమ భాగస్వామి కాదని, ఎన్డీయేలో భాగస్వామి అయిన జనసేనతోనే మేం కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణలో టీడీపీ ఏ పార్టీకి అనుకూలంగా ఉంటేనేం... ఎన్నికలనేవి ప్రజలు నిర్ణయించేవన్నారు. అయితే తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నామని టీడీపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని లక్ష్మణ్ గుర్తు చేశారు. ప్రజలు మాత్రం చాలా వివేకంగా ఆలోచన చేస్తారన్నారు. 

తెలంగాణలో కాంగ్రెస్‌కు టీడీపీ ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తోందని ఈటల రాజేందర్ నిన్న అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రశ్నించగా, లక్ష్మణ్ స్పందిస్తూ... కాంగ్రెస్‌కు టీడీపీ మద్దతిచ్చినా ఇక్కడి ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఏ పార్టీ అవసరమో ఆ పార్టీ వైపు ప్రజలు నిలబడతారన్నారు. ఏ ఒక్కరి నిర్ణయాల వల్ల ప్రజలు ప్రభావితమవుతారని తాను భావించడం లేదని టీడీపీని ఉద్దేశించి అన్నారు. ప్రజలు అవివేకులు కాదన్నారు.

More Telugu News