Bandi Sanjay: కేసీఆర్ కుటుంబం నుంచి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు రికవరీ చేయాలి: బండి సంజయ్

  • ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ప్రొజెక్టర్ పెట్టి కాళేశ్వరం లీకేజీ గురించి చెప్పాలన్న బండి సంజయ్
  • కేసీఆర్ నదులకు నేర్పిన నడక ఎక్కడకు పోయిందని ఎద్దేవా
  • కేసీఆర్ కాళేశ్వరం, అన్నారం ప్రాజెక్టుల నాణ్యతలను పట్టించుకోలేదని విమర్శ
Bandi Sanjay talks about medigadda and annaram projects issue

బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడటం లేదని, ప్రతి అసెంబ్లీ కేంద్రంలో ప్రొజెక్టర్ పెట్టి కాళేశ్వరం లీకేజీల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్‌కు ప్రజల ఓట్లపై నమ్మకం లేదని, కేవలం జనవశీకరణపై మాత్రమే నమ్మకం ఉందన్నారు. వశీకరణ, తాంత్రిక పూజలు చేస్తారని ఆరోపించారు. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్‌కు వెళ్లడం లేదన్నారు. కేసీఆర్ అందరి క్షేమం కోసం చేసే పూజలు మాత్రమే ఫలిస్తాయన్నారు.

ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని, తాజాగా అన్నారం బ్యారేజ్ లీక్ అయిందన్నారు. కేసీఆర్ తన ఎన్నికల ప్రచారంలో బ్యారేజీల లీక్ గురించి మాట్లాడాలన్నారు. కేసీఆర్ నదులకు నేర్పిన నడక ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎవరికీ ప్రయోజనం జరగలేదన్నారు. కాంట్రాక్టులు, కమీషన్‌లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదన్నారు. కేసీఆర్ పనుల నాణ్యతను పట్టించుకోలేదని విమర్శించారు. తాంత్రిక పూజ సామాగ్రిని కాళేశ్వరంలో కలిపేందుకే కేసీఆర్ వెళ్లాడన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వ తప్పిదమన్నారు. నాణ్యతా లోపం కారణంగానే మేడిగడ్డ, అన్నారం బ్యారేజీకి లీకులు వచ్చాయన్నారు. సరిగ్గా ప్రాజెక్టులు కట్టని కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పి ఓట్లు అడగాలన్నారు. ఈ ప్రభుత్వం కట్టిన డ్యాంలు కుంగుతున్నాయి.. లీక్ అవుతున్నాయన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలను రికవరీ చేయాలన్నారు. మేడిగడ్డ కుంగిపోవడం విద్రోహ చర్య అయితే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విద్రోహ చర్య అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

More Telugu News