KCR: ఇక్కడ కొందరు నేతలకు డబ్బులు రాగానే అహంకారం వచ్చింది.. అందుకే సవాల్ చేస్తున్నారు: ఇల్లందు సభలో కేసీఆర్

KCR participated in yellandu public meeting
  • అసెంబ్లీకి పంపించేది అహంకారపు నేతలా? ప్రజలా? అని కేసీఆర్ నిలదీత
  • కర్ణాటకలో 5 గంటల విద్యుత్ అయితే మనం 24 గంటలు ఇస్తున్నామన్న కేసీఆర్
  • ప్రలోభాలకు తలొగ్గి ఓటు వేయకూడదన్న కేసీఆర్
  • సరైన వ్యక్తిని ఎన్నుకోకుంటే ఓడిపోయేది ప్రజలే అని హెచ్చరిక
కర్ణాటకలో ఐదు గంటల విద్యుత్ ఇస్తున్నామని, అవసరమైతే బస్సు పెడతా... కేసీఆర్ రావాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారని, కానీ తెలంగాణలో మనం 24 గంటల విద్యుత్ ఇస్తున్న విషయం తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇల్లందులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. అరె సన్నాసి మా వద్ద 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని ఆ నేతకు చెప్పానని డీకే శివకుమార్‌ను ఉద్దేశించి అన్నారు. తాము మేనిఫెస్టోలో 10 మాత్రమే పెట్టామని, కానీ అమలు చేసింది 100 అన్నారు. ప్రలోభాలకు తలొగ్గి ఎవరూ ఓటు వేయవద్దని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల విద్యుత్ కావాలా? ఇప్పుడు మనం ఇస్తున్న 24 గంటల విద్యుత్ కావాలా? అని ప్రశ్నించారు.

ధరణితో రైతుల భూములు భద్రంగా ఉన్నాయన్నారు. తాము గిరిజనులకు పెద్ద ఎత్తున పోడు భూములిచ్చామన్నారు. 48వేల ఎకరాల పోడు భూములిచ్చామన్నారు. మూడోసారి అధికారంలోకి వస్తామని, తక్కువ ధరకే గ్యాస్ ఇస్తామన్నారు. రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యం ఇస్తామన్నారు. లక్ష కుటుంబాలకు రైతు బీమా అందిందన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని పచ్చగా చేస్తామన్నారు. ఇక్కడ కొందరు నేతలకు డబ్బులు రాగానే అహంకారం వచ్చిందని మండిపడ్డారు. అందుకే బీఆర్ఎస్ నాయకులను అసెంబ్లీలో కాలు పెట్టనివ్వబోమని సవాల్ చేస్తున్నారని, కానీ అసెంబ్లీకి పంపించేది ప్రజలా? లేక ఇలాంటి అహంకారపు నేతలా? అన్నారు. 

ఎన్నికలు వస్తుంటాయి... పోతుంటాయని, ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. పార్టీ చరిత్ర, దృక్పథం నిశితంగా గమనించి ఓటేయాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ పాలనలను చూశారని, కాబట్టి వివేకంతో ఓటు వేయాలన్నారు. ఇప్పటి వరకు పాలించిన వారిలో ఎవరు బాగా చేశారో చూడాలన్నారు సరైన వ్యక్తిని ఎన్నుకోకుంటే ఓడిపోయేది ప్రజలే అన్నారు. బీఆర్ఎస్ ప్రజల కోసమే పుట్టిన పార్టీ అన్నారు. ఇతర పార్టీల్లా తమకు ఢిల్లీలో బాసులు లేరని, ప్రజలే తమ బాసులు అని అన్నారు.
KCR
Telangana Assembly Election
BRS

More Telugu News