KCR: కాంగ్రెస్ భుజం మీద గొడ్డలి ఉంది.. అవకాశం ఇస్తే వేటు వేస్తారు: కేసీఆర్ హెచ్చరిక

KCR warns telangana people on elections
  • రైతులకు సాయం చేసే రైతుబంధు ఇవ్వవద్దా? అని కేసీఆర్ నిలదీత
  • రాహుల్ గాంధీకి ధరణి గురించి ఏం తెలుసునని ప్రశ్న
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళారుల రాజ్యమే వస్తుందని విమర్శ
  • సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళితజ్యోతిని అమలు చేశానన్న కేసీఆర్
కాంగ్రెస్ పార్టీ భుజం మీద గొడ్డలి ఉందని... వారికి అధికారం ఇస్తే వేటు వేయడం ఖాయమని ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అన్నారు. బుధవారం సత్తుపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు రైతుబంధు దుబారా అంటున్నారని, రైతులకు సాయం చేసే రైతుబంధు ఇవ్వవద్దా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని రాహుల్ గాంధీ చెబుతున్నారని, అసలు ఆయనకు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ధరణి వచ్చాక ఒకరి భూములు ఇంకొకరికి బదిలీ కావడం ఆగిపోయిందన్నారు. గ్రామాలు హాయిగా ఉంటున్నాయన్నారు. రైతుల కష్టాలు రాహుల్ గాంధీకి తెలుసా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వస్తే దళారుల రాజ్యమే అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలని తనకు చెప్పారని, కానీ సచ్చినా తాను అలా పెట్టేది లేదని స్పష్టం చేశానన్నారు. రూ.25 వేల కోట్లు అయినా తామే భరిస్తామని చెప్పానన్నారు. మోదీకి ప్రయివేటైజేషన్ అంటే మోజు అని విమర్శించారు. అందుకే చాలా కంపెనీలను ప్రయివేటీకరణ చేస్తున్నారన్నారు. దళిత బంధు అనే పథకం పుట్టించిందే కేసీఆర్ అన్నారు. ఎవరిని గెలిపిస్తే ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ కంటే ముందు ఎవరైనా దళిత బంధు గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఎస్సీల పరిస్థితి బాగోలేదన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎస్సీలను ఓటు బ్యాంకులుగా వాడుకున్నాయన్నారు.

తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళిత జ్యోతి అనే కార్యక్రమాన్ని అమలు చేశానని, దళితబంధుకు ఇదే స్ఫూర్తి అన్నారు. తాము మేనిఫెస్టోలో కూడా పెట్టని ఎన్నో పథకాలను అమలు చేశామన్నారు. ఓట్ల కోసమే దళితబంధు అంటే మేనిఫెస్టోలోనే పెట్టి ఉండే వారం కదా అన్నారు. హుజూరాబాద్‌లో వంద శాతం దళితబంధును అమలు చేశామన్నారు. మల్లు భట్టి విక్రమార్క నియోజకవర్గంలో ఒక మండలం మొత్తానికి దళితబంధు ఇచ్చామన్నారు.
KCR
Rahul Gandhi
Congress
BRS
Telangana Assembly Election

More Telugu News