V Srinivas Goud: కాంగ్రెస్ వల్లే ఉద్యమంలో ఆత్మహత్యలు... రాహుల్ గాంధీకి చరిత్ర తెలుసా?: మంత్రి శ్రీనివాస్ గౌడ్

  • తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు కంటోందన్న శ్రీనివాస్ గౌడ్
  • ఈ పదేళ్లలో తెలంగాణను అత్యధిక జీడీపీ కలిగిన రాష్ట్రంగా తయారు చేశామన్న మంత్రి
  • బీసీలపై కాంగ్రెస్ పార్టీది కపట ప్రేమ అని విమర్శలు
Minister Srinivas Goud counter to Rahul Gandhi

రాహుల్ గాంధీకి తెలంగాణ చరిత్ర తెలుసా? కాంగ్రెస్ వల్లే ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగాయి కదా? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ పగటి కలలు కంటోందన్నారు. రాహుల్ గాంధీ పొర్లు దండాలు పెట్టినా.. పదిసార్లు పర్యటించినా ఆ పార్టీ అధికారంలోకి రాదన్నారు. బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలన అని రాహుల్ గాంధీ విమర్శలు చేశారని, అలా అయితే ఆయనకున్న అర్హత ఏమిటని ప్రశ్నించారు.

పదకొండు సార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే సాగునీరు, తాగునీరు ఇవ్వకుండా పోతిరెడ్డిపాడుకు బొక్క కొట్టి, ఆర్డీఎస్ బద్దలు కొట్టి నీళ్లు దోచుకుపోయారన్నారు. ఈ పదేళ్లలో దేశంలోనే అత్యధిక జీడీపీ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎస్ మహారాష్ట్రలో విస్తరిస్తుంటే కాంగ్రెస్ భయపడుతోందన్నారు. మీ అవసరాల కోసం బీసీలు, మైనార్టీలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకున్నారని విమర్శించారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్‌కు జడ్చర్ల టికెట్ ఇవ్వకుండా వేరేవారికి ఇవ్వడంతోనే బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న కపట ప్రేమ తెలిసిందన్నారు. మీరెన్ని రోడ్ షోలు నిర్వహించినా... డ్రామాలు చేసినా జనం నమ్మరన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చెల్లని వారు అక్కడకు వెళ్లగానే టిక్కెట్ ఇచ్చారన్నారు. తమ నాయకుడు గల్లీలో ఉంటాడని, కానీ కాంగ్రెస్ అధిష్ఠానం ఢిల్లీలో ఉంటుందన్నారు. పగటి కలలు కంటున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు బొంద పెట్టడం ఖాయమన్నారు.

More Telugu News