Al Jazeera: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అల్ జజీరా న్యూస్ చానల్ ఉద్యోగి కుటుంబానికి చెందిన 19 మంది మృతి

 19 of Al Jazeera staffers family killed in Israeli attack on Gazas Jabalia refugee camp
  • తీవ్రంగా ఖండించిన అల్ జజీరా
  • ‘జబాలియా మారణహోమం’లో ఉద్యోగి తండ్రి, తోబుట్టువులు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, అన్నావదిన మృతి
  • అమానవీయ ఘటనకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సిందేనన్న అల్ జజీరా
  • అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేస్తామని హెచ్చరిక
  • అక్కడ ఉగ్రవాదులు దాక్కోవడం వల్లే దాడిచేశామన్న ఐడీఎఫ్
గాజా స్ట్రిప్‌లోని జబాలియా శరణార్థి క్యాంపై ఇజ్రాయెల్ నిన్న జరిపిన వైమానిక దాడిలో ప్రముఖ ఇంగ్లిష్ న్యూస్ చానల్ ‘అల్ జజీరా’ ఉద్యోగి మొహమ్మద్ అబు అల్ కుమ్సాన్‌ కుటుంబ సభ్యులు 19 మంది మరణించారు. ఈ విషయాన్ని అల్ జజీరా నేడు ప్రకటించింది. ఇజ్రాయెల్ తాజా దాడుల్లో హమాస్ కమాండర్ సహా కనీసం 50 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు తెలుస్తోంది. 

ఈ ఘటనపై అల్ జజీరా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంకితభావం కలిసిన తమ ఎస్ఎన్‌జీ ఇంజినీర్ అబ్దుల్ అల్ కుమ్సాన్ కుటుంబ సభ్యులు 19 మంది మరణానికి కారణమైన ఘోరమైన, విచక్షణ రహిత ఇజ్రాయెల్ బాంబు దాడిని ఖండిస్తున్నట్టు పేర్కొంది. ‘జబాలియా మారణహోమం’లో కుమ్సాన్ తండ్రి, ఇద్దరు తోబుట్టువులు, 8 మంది మేనల్లుళ్లు, మేనకోడళ్లు, ఆయన అన్నా, వదిన, వారి నలుగురు పిల్లలు, ఆయన మరో వదిన, మామ మరణించినట్టు వివరించింది. 

మొహమ్మద్, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొంది. అమాయక పౌరుల మరణాలకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాల్సి ఉందని తెలిపింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేస్తామని తెలిపింది. ఈ అమానవీయ హత్యలపై అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేస్తామని వివరించింది. 

ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్).. కీలకమైన హమాస్ కమాండ్ అక్కడ దాగి ఉండడం వల్లే జబాలియా శరణార్థి శిబిరంపై దాడి చేసినట్టు వివరణ ఇచ్చింది. హమాస్ కమాండర్ బియారీ సహా మరో 12 మంది ఫైటర్లు మరణించినట్టు తెలిపింది. మరోవైపు, జబాలియాలో 400 మంది వరకు మరణించినట్టు హమాస్ తెలిపింది.
Al Jazeera
Israel-Hamas War
Gaza Strip
Mohamed Abu Al-Qumsan
Jabalia Refugee Camp

More Telugu News