Cricket: సెమీస్ రేసులోకి వచ్చేసిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై గెలుపుతో మారిన సమీకరణం

- 6 పాయింట్లతో 5వ స్థానానికి చేరిన పాక్
- న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు ప్రతికూల ఫలితాలు ఎదురైతే మెరుగవనున్న అవకాశాలు
- సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన బంగ్లాదేశ్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో పేలవ ప్రదర్శన కారణంగా పాకిస్థాన్ ఇంటి దారి పట్టినట్టేనని క్రికెట్ నిపుణులు విశ్లేషించారు. సెమీస్ చేరే అవకాశాలు దాదాపు ముగిసినట్టేనని భావించారు. అయితే మంగళవారం బంగ్లాదేశ్‌పై ఘనవిజయంతో పాక్ తిరిగి సెమీస్ రేసులోకి వచ్చింది. ఇప్పటివరకు మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన దాయాది దేశం 3 విజయాలు సాధించడంతో తన ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. బంగ్లాపై గెలుపు తర్వాత పాయింట్ల పట్టికలో ఐదవ స్థానానికి చేరుకుంది. మూడు, నాలుగవ స్థానాల్లో ఉన్న న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కంటే రెండు పాయింట్లు మాత్రమే పాక్ వెనుకబడి ఉంది. అయితే ఆ రెండు జట్ల కంటే ఒక మ్యాచ్ ఎక్కువగా ఆడడం పాక్‌కు కొంత మైనస్‌గా కనిపిస్తోంది.
సెమీస్‌కు చేరుకోవాలంటే పాకిస్థాన్ తాను విజయాలు సాధించడమే కాకుండా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఓటమి పాలైతే పాక్ అవకాశాలు మెరుగవుతాయి. లేదంటే సెమీఫైనల్‌కు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. ఇదిలాఉండగా పాక్‌పై ఓడిపోవడంతో బంగ్లాదేశ్ సెమీఫైనల్ ఆశలు ముగిసిపోయాయి. బంగ్లాదేశ్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడగా కేవలం 1 విజయం మాత్రమే సాధించింది. 2 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా టాప్-4లోకి ప్రవేశించే అవకాశమే లేదు. కాబట్టి షకీబ్ అల్ హసన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అధికారికంగా నిష్ర్కమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా ఇప్పటివరకు ఏ జట్టూ సెమీఫైనల్ స్థానాన్ని ఖరారు చేసుకోకపోవడం గమనార్హం.
కాగా మంగళవారం బంగ్లాదేశ్‌పై పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. వరుసగా 4 ఓటముల పరంపరకు ముగింపు పలుకుతూ 205 పరుగుల సులువైన లక్ష్యాన్ని సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Teams | Matches Played | Won | Lost | Point | Run Rate |
India | 6 | 6 | 0 | 12 | 1.405 |
South Africa | 6 | 5 | 1 | 10 | 2.032 |
New Zealand | 6 | 4 | 2 | 8 | 1.232 |
Australia | 6 | 4 | 2 | 8 | 0.970 |
Pakistan | 7 | 3 | 4 | 6 | -0.024 |
Afghanistan | 6 | 3 | 3 | 6 | -0.718 |
Sri Lanka | 6 | 2 | 4 | 4 | -0.275 |
Netherlands | 6 | 2 | 4 | 4 | -1.277 |
Bangladesh | 7 | 1 | 6 | 2 | -1.446 |
England | 6 | 1 | 5 | 2 | -1.652 |