Pakistan: నాలుగు ఓటముల తర్వాత ఓ గెలుపు... పాకిస్థాన్ సెమీస్ ఆశలు సజీవం

  • బంగ్లాదేశ్ పై 7 వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్థాన్
  • ఈడెన్ గార్డెన్స్ లో ఏకపక్షంగా సాగిన మ్యాచ్
  • 205 పరుగుల లక్ష్యాన్ని 32.3 ఓవర్లలో ఛేదించిన పాక్
  • రాణించిన పాక్ ఓపెనర్లు
  • ఈ విజయంతో ఐదో స్థానానికి ఎగబాకిన పాక్
Pakistan beat Bangladesh and kept semis chances alive

వరల్డ్ కప్ టోర్నీలో వరుస పరాజయాల తర్వాత పాకిస్థాన్ జట్టు ఓ విజయం సాధించింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే, నేటి మ్యాచ్ లో తప్పక గెలవాలన్న నేపథ్యంలో... కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ పై ఘనవిజయం నమోదు చేసింది. 

వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న పాక్... ఇవాళ బంగ్లాదేశ్ పై ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. తొలుత బంగ్లాదేశ్ ను 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ చేసిన పాక్... 205 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 32.3 ఓవర్లలో ఛేదించింది.

పాక్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే ఫకార్ జమాన్, అబ్దుల్లా షఫీక్ ల ఓపెనింగ్ భాగస్వామ్యమే. వీరిద్దరూ తొలి వికెట్ కు 128 పరుగులు జోడించి పాక్ విజయానికి బాటలు వేశారు. ఇమాముల్ హక్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఫఖార్ జమాన్ అద్భుతంగా ఆడాడు. 74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 81 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 69 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేశాడు.

కెప్టెన్ బాబర్ అజామ్ (9) స్వల్ప స్కోరుకు వెనుదిరిగినప్పటికీ... మహ్మద్ రిజ్వాన్ (26 నాటౌట్), ఇఫ్తికార్ అహ్మద్ (17 నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ఫినిష్ చేశారు. పాక్ ఇన్నింగ్స్ లో పతనమైన మూడు వికెట్లు బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ ఖాతాలో చేరాయి. 

ఈ విజయంతో పాక్ సెమీస్ అవకాశాలు సజీవంగా నిలిచాయి. టోర్నీలో ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు సాధించిన పాక్ 6 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. పాక్ ఇంకా న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్ తప్పక గెలిస్తేనే సెమీస్ బెర్తుపై ఆశలు నిలుస్తాయి. అదే సమయంలో టాప్-4 జట్లు కొన్ని మ్యాచ్ లలో ఓడిపోవాల్సి ఉంటుంది.

More Telugu News