Kommireddy Avinash: ఈ-చలాన్ నిధుల స్వాహా కేసులో మాజీ డీజీపీ అల్లుడిపై కేసు నమోదు

  • ఏపీలో కలకలం రేపిన ఈ-చలాన్ కుంభకోణం
  • ఈ-చలాన్ పేమెంట్ గేట్ వేల క్లోనింగ్ తో కోట్ల రూపాయల స్వాహా
  • ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏపీ పోలీసులు
  • ఏపీ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు
Case filed on Kommireddy Avinash in e Challan scam

ఈ-చలాన్ నిధుల స్వాహా కేసులో ఏపీ మాజీ డీజీపీ ఎన్.సాంబశివరావు అల్లుడు కొమ్మిరెడ్డి అవినాశ్ పై కేసు నమోదైంది. ట్రాఫిక్ ఈ-చలాన్ ఖాతాల పేమెంట్ గేట్ వేలను క్లోనింగ్ చేసి, వాటి ద్వారా చలాన్ సొమ్మును దారి మళ్లించారన్నది అవినాశ్ పై ఉన్న ప్రధాన ఆరోపణ. 

ఇందులో మనీలాండరింగ్ కోణం నేపథ్యంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు షురూ చేసింది. ఇప్పటికే ఏపీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగించనుంది. ఈ కేసులో అవినాశ్ తో పాటు ఆయనకు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థను, మరికొందరిని నిందితులుగా పేర్కొంటున్నారు. రూ.36.5 కోట్లను తమ ఖాతాల్లోకి మళ్లించినట్టు భావిస్తున్నారు. 

అవినాశ్ కు చెందిన డేటా సంస్థలో పనిచేసే కొత్తపల్లి రాజశేఖర్ అనే వ్యక్తిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈడీ... డేటా ఎవాల్వ్ సంస్థ డైరెక్టర్లుగా ఉన్న అవినాశ్, అతని సోదరి అక్షిత, రవికిరణ్ అనే వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. 

సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు జారీ చేసే ఈ-చలాన్ల ద్వారా వచ్చే జరిమానాలను నాలుగు పేమెంట్ గేట్ వేల ద్వారా డీజీపీ అకౌంట్ లో జమ చేస్తారు. 2017లో ఎన్.సాంబశివరావు డీజీపీగా ఉన్నారు. ఆ సమయంలో ఉన్న నాలుగు పేమెంట్ గేట్ వేలలో రేజర్ పే అనే గేట్ వే కూడా ఉంది. రేజర్ పే... సాంబశివరావు అల్లుడు అవినాశ్ కు చెందిన డేటా ఎవాల్వ్ సంస్థకు చెందినదిగా భావిస్తున్నారు.

More Telugu News