Sachin Tendulkar: రేపు వాంఖెడే స్టేడియంలో సచిన్ విగ్రహం ఆవిష్కరణ

Sachin statue will unveil tomorrow in Wankhede stadium
  • భారత్ క్రికెట్ దేవుడిగా సచిన్ టెండూల్కర్
  • ఈ ఏడాది ఏప్రిల్ లో 50వ పుట్టినరోజు జరుపుకున్న సచిన్
  • వాంఖెడే స్టేడియంలో విగ్రహం ఏర్పాటు చేసిన మహారాష్ట్ర క్రికెట్ సంఘం
  • విగ్రహావిష్కరణకు హాజరుకానున్న సీఎం ఏక్ నాథ్ షిండే
తన అమోఘమైన బ్యాటింగ్ నైపుణ్యం, ఎవరికీ సాధ్యం కాని రికార్డులతో క్రికెట్ దేవుడిగా ఖ్యాతిగాంచిన సచిన్ టెండూల్కర్ కు గొప్ప గౌరవం దక్కనుంది. ముంబయిలోని విఖ్యాత వాంఖెడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు (నవంబరు 1) జరగనుంది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరుకానున్నారు.

 నవంబరు 2న టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య వాంఖెడే స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వేళ సచిన్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. వాంఖెడే స్టేడియంలో సచిన్ పేరిట ఉన్న స్టాండ్స్ కు దగ్గరగా ఈ విగ్రహం ఏర్పాటు చేశారు.

సచిన్ ఈ ఏడాది ఏప్రిల్ లో 50వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈ నేపథ్యంలోనే, ఈ విగ్రహాన్ని మహారాష్ట్ర  క్రికెట్ సంఘం ఏర్పాటు చేసింది. సచిన్ షాట్ కొడుతున్నట్టుగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. భారత క్రికెట్ చరిత్రలోనే మహోన్నత బ్యాట్స్ మన్ గా సచిన్ ఎప్పటికీ నిలిచిపోతాడు. ఫార్మాట్ ఏదైనా తనదైన శైలిలో పరుగులు వెల్లువెత్తించడమే ఈ మ్యాస్ట్రోకు తెలిసిన విద్య. 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ప్రతిభ మాత్రమే కాదు వినయ విధేయతలు కూడా ఉండాలని పెద్దలు చెప్పే మాటలకు సిసలైన రూపం సచిన్ టెండూల్కర్. అందుకే, ఇతర జట్ల ఆటగాళ్లు కూడా సచిన్ ను ఎంతగానో అభిమానిస్తుంటారు.

సచిన్ కెరీర్ గణాంకాలు చూస్తే ఎవరైనా సాహో అనాల్సిందే. 200 టెస్టుల్లో 53.78 సగటుతో 15,921 పరుగులు చేశాడు. అందులో 51 సెంచరీలు, 68 అర్ధసెంచరీలు ఉన్నాయి. 463 వన్డేల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు సాధించాడు. అందులో 49 సెంచరీలు, 96 అర్ధసెంచరీలు ఉన్నాయి. 

సచిన్ తన కెరీర్ లో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. అందులో 10 పరుగులు చేసి, ఒక వికెట్ తీశాడు. సచిన్ మీడియం పేసర్, లెగ్ స్పిన్నర్ కూడా. టెస్టుల్లో 46, వన్డేల్లో 154 వికెట్లు తీయడం విశేషం.
Sachin Tendulkar
Statue
Wankhede Stadium
Mumbai
Maharashtra
Team India

More Telugu News