KTR: కామారెడ్డిలో భూములు ఎవరూ అమ్ముకోవద్దు... కేసీఆర్ ఒక్కసారి అడుగుపెట్టాడంటే...: కేటీఆర్ వ్యాఖ్య

KTR suggest kamareddy people dont sell their lands
  • కేసీఆర్ వచ్చాక భూముల ధరలు ఇరవై నుంచి ముప్పై రెట్లు పెరుగుతాయన్న కేటీఆర్
  • కామారెడ్డి ప్రజల కోసమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయమని వెల్లడి
  • గంప గోవర్ధన్ పట్టుబట్టి కేసీఆర్‌తో పోటీ చేయిస్తున్నారన్న కేటీఆర్
  • రేవంత్ రెడ్డికి కామారెడ్డి సత్తా చూపించాలని పిలుపు
కామారెడ్డిలో ఉన్నవారు ఎవరూ భూములు అమ్ముకోవద్దని, కేసీఆర్ మళ్లీ గెలిచాక మరింతగా పెరుగుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ఇక్కడ ఒక్కసారి అడుగు పెట్టాడంటే భూముల ధరలు ఇరవై నుంచి ముప్పై రెట్లు పెరుగుతాయన్నారు. ఇంచు భూమి ఉన్నా వంద గజాలున్నా అమ్ముకోవద్దని, కాపాడుకోవాలన్నారు. అసైన్డ్ భూములు ఉంటే దళితులు, గిరిజనులకు అధికారం ఇస్తామన్నారు. కామారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.... కామారెడ్డి నియోజకవర్గ మేలు కోసమే ఇక్కడి నుంచి పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారన్నారు.

కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పట్టుబట్టి మరీ ముఖ్యమంత్రిని ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఒప్పించారన్నారు. కేసీఆర్ ఎంతోముందే 114 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారన్నారు. వాటన్నింటిలో ఒక్క కామారెడ్డి నియోజకవర్గంపై మాత్రం ప్రజలు ప్రత్యేకమైన ఆసక్తి కనబర్చారని, అందుకు కారణం ఇక్కడి నుంచి కేసీఆర్‌ బరిలో దిగడమే అన్నారు. తాను పోటీ చేయనని కేసీఆర్ చెప్పినా గోవర్ధన్ వినలేదని,  ముఖ్యమంత్రి నియోజకవర్గం అని ఓసారి ముద్రపడితే ఇక కామారెడ్డి రూపురేఖలు మారుతాయని బతిమాలినట్లు చెప్పారు. దాంతో సీఎం కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారన్నారు.

నవంబర్ 9న సీఎం కేసీఆర్‌ కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారని, కాబట్టి 9వ తేదీన కామారెడ్డి మొత్తం కదిలి రావాలన్నారు. కామారెడ్డి సత్తా ఏంటో ఇక్కడ పోటీ చేస్తానంటున్న రేవంత్ రెడ్డికి చూపించాలన్నారు. తెగ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడగొట్టినట్టు.. రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కేసీఆర్‌ మీద పోటీ చేస్తా అని వస్తున్నాడని,  ఎవరొచ్చినా ఏం చేసినా గులాబీ జెండాను గెలిపించడం కామారెడ్డి ప్రజలకు కొత్త కాదన్నారు. అలాంటి కామారెడ్డికి వచ్చి తానేదో చేస్తా అని రేవంత్‌ రెడ్డి అంటున్నాడని, తనకు కామారెడ్డి అన్నలు, తమ్ముళ్ల, అక్కాచెల్లెళ్ల మీద సంపూర్ణ నమ్మకం ఉన్నదన్నారు.
KTR
KCR
Telangana Assembly Election
Kamareddy District

More Telugu News