Chandrababu: మీరు చూపిన అభిమానం నా జీవితంలో మర్చిపోను: చంద్రబాబు

  • జైలు నుంచి విడుదలైన చంద్రబాబు
  • టీడీపీ శ్రేణులను చూసి భావోద్వేగాలకు లోనైన అధినేత
  • ఇంతమంది తనకోసం నిరసనలు తెలిపారంటూ కృతజ్ఞత 
  • తన జన్మ ధన్యమైందన్న టీడీపీ అధినేత
  • పవన్ కల్యాణ్ కు, జనసేనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
Chandrababu speech at Rajahmundry jail

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైలు నుంచి విడుదలైన అనంతరం పార్టీ శ్రేణులు, తెలుగు ప్రజలు, తనకు మద్దతుగా నిలిచిన రాజకీయ పక్షాలను ఉద్దేశించి ప్రసంగించారు. మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కొంచెం బలహీనంగా కనిపించిన చంద్రబాబు దగ్గుతూనే మాట్లాడారు. 

"తెలుగు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇవాళ నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి మీరు సంఘీభావం తెలియజేశారు, పూజలు చేశారు, నా కోసం ప్రార్థనలు చేశారు. మీరు చూపించిన అభిమానం నా జీవితంలో మర్చిపోలేను. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 

అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశవిదేశాల్లో నా కోసం మీరు పడిన తాపత్రయం ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆ రోజున నేను చేసిన అభివృద్ధి పనులను కూడా మీరు ఎక్కడికక్కడ చాటి చెబుతూ రోడ్లపైకి వచ్చి నాకు సంఘీభావం తెలిపారు. నేను చేసిన పనులు మీకు ఏ విధంగా ఉపయోగపడ్డాయో, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయో అందరికీ తెలియజెప్పారు. దీంతో నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడికి రాదు. 

45 ఏళ్ల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు... ఎవరినీ తప్పు చేయనివ్వలేదు... అదీ ఇప్పటివరకు నా నిబద్ధత. ఇక, రాజకీయ పరంగా అన్ని పార్టీలు నాకు సంఘీభావం ప్రకటించాయి. నాకు మద్దతుగా నిలిచిన అన్ని పార్టీలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

ప్రత్యేకంగా జనసేన పార్టీ గురించి చెప్పుకోవాలి. వారు బాహాటంగా మద్దతు పలికి పూర్తిగా సహకరించారు. అందుకు పవన్ కల్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. జనసేన మాత్రమే కాదు, బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్, కొందరు కాంగ్రెస్ నేతలు... ఇలా అందరూ నాకు సంఘీభావం తెలియజేశారు. వాళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 

నాకోసం కార్యకర్తలు, నేతలు 52 రోజులుగా రోడ్లపైకి వచ్చి నిరవధికంగా పోరాడారు. మొన్ననే కొందరు శ్రీకాకుళం నుంచి కుప్పంకు సైకిల్ యాత్ర చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. 

అటు, హైదరాబాదులో సైబర్ టవర్స్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటీ నిపుణులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున మద్దతు పలికారు. వారు ఏ విధంగా ప్రయోజనం పొందారో కూడా సోదాహరణంగా వివరించారు. వారందరికీ కృతజ్ఞతలు. మీడియా కూడా పెద్ద ఎత్తున సహకరించింది. మీడియా ప్రతినిధులకు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పక్కనే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ప్రసంగం అనంతరం చంద్రబాబు తన కాన్వాయ్ లో భారీ భద్రత మధ్య అమరావతి బయల్దేరారు.

More Telugu News