Harish Rao: కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని 'కోడికత్తి' అంటూ అపహాస్యమా?: హరీశ్ రావు ఆగ్రహం

  • ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే ఖండించాల్సిన ప్రతిపక్షాలు ఇలా మాట్లాడటం విడ్డూరమన్న హరీశ్ రావు
  • కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్న మంత్రి
  • తెలంగాణ ప్రజలు హత్యా రాజకీయాలను హర్షించరని వ్యాఖ్య
Harish Rao fires at opposition parties for their comments

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కోడికత్తి అంటూ విపక్షాలు అపహాస్యం చేయడం సరికాదని బీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రజాప్రతినిధిపై దాడి జరిగితే ఖండించాల్సిన ప్రతిపక్షాలు ఇలా మాట్లాడం విడ్డూరమన్నారు. కత్తి దాడితో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్ రెడ్డిని హరీశ్ రావు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఘటనకు సంబంధించి నిందితుడి కాల్ డేటాను పోలీసులు సేకరించారని, విచారణ చేస్తున్నారన్నారు. వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. గతంలో రాయలసీమ, బీహార్ రాష్ట్రాలలో ఇలాంటి రాజకీయాలు చూశామన్నారు. తెలంగాణలో మొదటిసారి ప్రతిపక్షాలు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కానీ ప్రజలు హత్యా రాజకీయాలను హర్షించరన్నారు. ఒకటి రెండు రోజుల్లో పోలీసులు కుట్ర కోణాన్ని ఛేదిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News