Nara Lokesh: చంద్రబాబుకు బెయిల్.. యుద్ధం ఇప్పుడే మొదలైందన్న లోకేశ్

  • తండ్రికి బెయిల్ రావడంపై సంతోషం వ్యక్తం చేసిన యువనేత
  • భార్య నారా బ్రాహ్మణితో కలిసి రాజమండ్రికి చేరుకున్న లోకేశ్
  • లిక్కర్ దందాపై రాష్ట్రంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని జగన్ కు సవాల్
War begins Now says Nara Lokesh

తెలుగుదేశం పార్టీ అధినేత, తన తండ్రి చంద్రబాబుకు బెయిల్ మంజూరైన విషయం తెలిసి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకు ఊరట లభించిందన్నారు. విషయం తెలిసి భార్య నారా బ్రాహ్మణితో కలిసి లోకేశ్ రాజమండ్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీని ఉద్దేశించి యుద్ధం ఇప్పుడే మొదలైందని హెచ్చరించారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై లోకేశ్ విమర్శలు గుప్పించారు. మద్యపాన నిషేధం పేరుతో జగన్ లక్ష కోట్ల ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు. ఆయన తెచ్చిన పిచ్చి మందుకు 35 లక్షల మంది రోగాల బారిన పడ్డారని, 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. కక్ష సాధింపుకు మానవ రూపమే జగన్ అని, పిచ్చికి లండన్ మందులు వాడుతున్నట్లే కక్ష సాధింపు తగ్గడానికి ఏ అమెరికా మందులో వాడితే మంచిదని హితవు పలికారు.

‘జగన్ నీకో చిన్న జే బ్రాండ్ ఛాలెంజ్.. రాష్ట్రంలో నువ్వు పెట్టిన ఏ లిక్కర్ షాపు ముందైనా చర్చకు నేను రెడీ.. ఎవరి హయాంలో లిక్కర్ దందా జరుగుతుందో తేల్చుకుందామా?’ అంటూ జగన్ కు సవాల్ విసిరారు. మందు బాబులు తిడుతున్న తిట్లు వినే ధైర్యం ఉంటే టైం అండ్ డేట్ ఫిక్స్ చెయ్యాలని సూచించారు. కక్ష సాధింపులో జగన్.. ప్రెసిడెంట్ మెడల్ లాంటి వ్యక్తి, ఆంధ్రా గోల్డ్ అంటూ లోకేశ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

More Telugu News