K Kavitha: తెలంగాణ అభివృద్ధి దేశానికే తలమానికం.. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ కవిత

  • బీడుభూములను పంటపొలాలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనన్న కవిత
  • అభివృద్ధి అంటే ఆర్థిక గణాంకాలు మారడం కాదని స్పష్టీకరణ
  • ధాన్యం ఉత్పత్తిలో రెండో స్థానానికి ఎదిగామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
  • తెలంగాణ విజయగాథను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చెప్పడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న కవిత
Glad to have had the opportunity to present the story of Telangana says Kavitha

‘డెవలప్‌మెంట్ ఎకనమిక్స్’ అంశంపై లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి దేశానికే దిక్సూచి అని పేర్కొన్నారు. బీడు భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. 

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత శాంతికి భంగం కలిగించే ఒక్క ఘటన కూడా జరగలేదని తెలిపారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక గణాంకాలు మారడం కాదని, జీవన స్థితిగతులు మారడమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 10 జిల్లాల్లో 9 వెనకబడి ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. కరెంటు సరఫరా లేక, నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంస్కరణలు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ఆ పరిస్థితులను పూర్తిగా మార్చివేశారన్నారు. ఇప్పుడు మిగులు విద్యుత్ సాధించడంతోపాటు ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానానికి చేరిందని తెలిపారు. 

 తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)  155.7 శాతం పెరిగిందన్న కవిత.. ఈ విషయంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు.  రైతులకు ఉచితంగా 24 గంటలూ సాగునీరు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే పూర్తిచేసినట్టు తెలిపారు. 2014లో రూ. 62 లక్షల కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్ ప్రస్తుతం 2.94 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. 

పునరుత్పాదక విద్యుత్‌లోనూ తెలంగాణ ముందు ఉందన్న కవిత తలసరి విద్యుత్ వినియోగం 2,126 యూనిట్లకు చేరుకుందని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. అలాగే, హరితహారం,  దళితబంధు, టీఎస్ఐపాస్, మెడికల్ కాలేజీలు, తెలంగాణకు క్యూకడుతున్న బహుళజాతి కంపెనీలు వంటి వాటి గురించి కవిత తన ప్రసంగంలో వివరించారు. కాగా, తెలంగాణ విజయగాథను ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చెప్పుకునే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్టు చెబుతూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.

More Telugu News