Atchannaidu: చంద్రబాబు జైలు నుంచి అడుగు బయటపెట్టిన క్షణం నుంచే జగన్ పతనం ప్రారంభమవుతుంది: అచ్చెన్నాయుడు

  • చంద్రబాబును జైల్లో ఉంచి జగన్ లబ్ధి పొందాలని చూశారన్న అచ్చెన్న
  • ఈరోజు తమకు న్యాయం జరిగిందని వ్యాఖ్య
  • చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో జగన్ అని మండిపాటు
Jagan downfall starts from the moment Chandrababu steps out from jail says Atchannaidu

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. బెయిల్ మంజూరైన వెంటనే మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష పెట్టుకుని, తప్పు లేకపోయినా కేసులు పెట్టారనే విషయం తెలుగు ప్రజలందరికీ తెలిసి పోయిందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి, జైల్లో ఉంచి లబ్ధి పొందాలని జగన్ చూశారని విమర్శించారు. 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు చిన్న తప్పు కూడా చేయలేదని... పార్టీలో ఎవరు తప్పు చేసినా ఆయన సహించరని చెప్పారు. 

మహానుభావుడు చంద్రబాబును ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడు జగన్ 52 రోజుల పాటు జైల్లో పెట్టించారని అచ్చెన్న మండిపడ్డారు. బెయిల్ పై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తే... రాత్రికి రాత్రే చంద్రబాబుపై లిక్కర్ కేసు పెట్టించిన సైకో అని దుయ్యబట్టారు. చంద్రబాబు అరెస్ట్ జగన్ పతనానికి నాంది అని... బాబు జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన క్షణం నుంచే వైసీపీ పతనమవుతుందని చెప్పారు. వైసీపీని బంగాళాఖాతంలో కలుపుతామని వ్యాఖ్యానించారు. హైకోర్టులో ఈరోజు తమకు న్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికే లోకేశ్ బాబు రాజమండ్రిలో ఉన్నారని... తాము కూడా ఇప్పుడు రాజమండ్రికి బయల్దేరుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అందరం కూర్చొని చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. 

More Telugu News