Israel-Hamas War: కాల్పుల విరమణకు నో.. విజయం సాధించే వరకు యుద్ధం కొనసాగుతుంది: ఇజ్రాయెల్

  • గాజాపై భూతల దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్
  • హమాస్ అంతం చూసే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని స్పష్టీకరణ
  • కాల్పుల విరమణకు అమెరికా, దాని మిత్రపక్షాలు కూడా అభ్యంతరం
  • బందీలను వెనక్కి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్న నెతన్యాహు
Israel Rejects Ceasefire

హమాస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ పెను నష్టాన్ని కలిగిస్తున్న ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు ససేమిరా అంటోంది. గాజాపై భూతల దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు నో చెప్పింది. హమాస్ అంతం చూసి యుద్ధంలో విజయం సాధించే వరకు వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు నిన్న మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అది జరిగే పని కాదని స్పష్టం చేశారు. విజయం సాధించే వరకు యుద్ధం చేస్తామని పేర్కొన్నారు. అమెరికా, దాని మిత్ర పక్షాలు కూడా కాల్పుల విరమణను వ్యతిరేకిస్తున్నాయి.

* హమాస్ ఉగ్రవాదుల చేతిలో ఇజ్రయెలీలు, విదేశీ బందీలు కలిసి దాదాపు 230 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో నెతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
 * అక్టోబరు 7న బందీలుగా చేసుకున్న వారిలో ముగ్గురు మహిళల వీడియోను హమాస్ నిన్న విడుదల చేసింది. దీనిపై నెతన్యాహు స్పందిస్తూ.. ఇది ‘క్రూరమైన మానసిక ప్రచారం’గా మండిపడ్డారు. బందీలను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 * గాజా స్ట్రిప్‌పై భూతల దాడులకు దిగిన ఇజ్రాయెల్ ఆర్మీ ఓ మహిళా సైనికురాలిని హమాస్ చెర నుంచి విడుదల చేసింది. ఒరి మెగెదిష్ అనే ఆ సైనికురాలిని అక్టోబరు 7న హమాస్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. 
* హమాస్ ఇటీవల ఇద్దరు అమెరికా పౌరులు సహా నలుగురిని విడిచిపెట్టింది. తమ వద్దనున్న మిగతా బందీలను విడిచిపెట్టాలంటే కాల్పుల విరమణ తప్పనిసరని షరతు పెట్టింది. అంతేకాదు, తమ వద్ద బందీలుగా ఉన్న అందరినీ విడిచిపెట్టాలంటే ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గుతున్న తమ వారిని విడిచిపెట్టాలన్న డిమాండ్‌ను తీసుకొచ్చింది. 
* గాజాపై భూతల దాడులను తీవ్రతరం చేసిన ఇజ్రాయెల్ ట్యాంకులు నిన్న గాజా నగరంలో మరింత ముందుకు కదిలి జేతెన్ జిల్లాలోకి చొచ్చుకెళ్లాయి. 
* మ్యూజిక్ ఫెస్ట్ నుంచి హమాస్ తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన జర్మనీ మహిళ నిన్న చనిపోయి కనిపించింది. 
* ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో 8,300 మంది మరణించినట్టు హమాస్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.  
* హమాస్ దాడుల్లో 1,400 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందలాదిమంది కిడ్నాపయ్యారు.

More Telugu News