Telugudesam: పొన్నూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కిలారు ఏటీఎంగా మార్చుకున్నారు: ధూళిపాళ్ల నరేంద్ర

  • పంటలు ఎండిపోతున్నా రైతులను పట్టించుకోవడంలేదని ఆరోపణ
  • పదవిని, నియోజకవర్గాన్ని పాడి గేదెలా మార్చుకున్నారని ఎమ్మెల్యేపై మండిపాటు
  • టీడీపీ హయాంలో రూ.53 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశామని ప్రస్తావన
Ponnur constituency has become an ATM for MLA Kilaru says Dhulipalla Narendra

పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్యపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. కిలారు తన నియోజకవర్గాన్ని ఏటీఎంగా (ఎనీ టైమ్ మనీ) మార్చుకున్నారని మండిపడ్డారు. కౌలుకు తీసుకొని, ఎకరాకి రూ.30 వేలు ఖర్చు పెట్టి వేసిన పంట కళ్ల ముందు ఎండిపోతుంటే రైతుల కోసం ఏమీ చేయడంలేదంటూ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఏమీ చేయలేరని, ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు.

కిలారు వెంకట్రావు పొన్నూరు నియోజకవర్గాన్ని ఏటీఎం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే పదవిని, నియోజకవర్గాన్ని ఆయన ఎనీటైమ్ మనీగా మార్చుకున్నారని అన్నారు. నియోజకవర్గాన్ని పాడి గేదె లాగా మార్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబ్బులు దండుకోవడం తప్పితే ప్రజల బాధలు ఆయనకు పట్టవని వ్యాఖ్యానించారు.

ప్రజల బాధలు కలెక్టర్‌కు పట్టవని, ముఖ్యమంత్రికి కూడా పట్టవని ఆరోపించారు. టీడీపీ హయంలో ఈ ప్రాంతంలో పంటలను కాపాడడానికి రూ.53 కోట్లతో ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేశామని అన్నారు. కానీ నేడు ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పనిచేయడం లేదని పేర్కొన్నారు. అధికారం ఇస్తే రైతు సమస్యలు పరిష్కారం చేయకపోగా, వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించుకునేందుకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

More Telugu News