Pakistan: పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్‌ పదవి‌కి ఇంజమామ్ ఉల్ హక్ గుడ్‌బై

  • ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపిక సరిగా జరగలేదనే ఆరోపణలే కారణం
  • పీసీబీ పారదర్శక దర్యాప్తు కోసమే వైదొలగుతున్నట్టు రాజీనామా లేఖలో వెల్లడి
  • వరల్డ్ కప్‌‌లో పాక్ వరుస ఓటముల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామం
Inzamam ul Haq resigns from role of Pakistan chief selector

ప్రపంచ కప్ 2023లో పాకిస్థాన్ జట్టు ఘోర వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న వేళ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ సెలక్టర్ పదవికి మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ రాజీనామా చేశాడు. ప్రపంచ కప్ 2023లో పాక్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి కారణంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జకా అష్రాఫ్‌కు పంపించాడు. ప్రపంచ కప్‌ కోసం జట్టు ఎంపిక ప్రక్రియ సరిగా జరగలేదని, జట్టు ఎంపికలో వర్గపోరు నడిచిందంటూ స్వదేశంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఇంజమామ్ ప్రపంచ కప్ జరుగుతుండగానే తన పదవికి గుడ్‌బై చెప్పాడు.

జట్టు ఎంపికపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమైంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మీడియాలో వచ్చిన ఆరోపణలపై పీసీబీ పారదర్శకంగా విచారణ చేపట్టేందుకు వీలుగా పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ఇంజమామ్ కారణాన్ని చూపాడు. ఒకవేళ కమిటీ తనను నిర్దోషిగా తేల్చితే తిరిగి చీఫ్ సెలెక్టర్‌గా కొనసాగుతానని రాజీనామా లేఖలో స్పష్టం చేశాడు. ఈ మేరకు పీసీబీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

కాగా.. ఇంజమామ్ రాజీనామా పీసీబీకి ఆర్ఠిక భారంగా మారే అవకాశం ఉందని పాకిస్థాన్ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఒప్పందం రద్దు కారణంగా ఇంజమామ్‌కు సుమారుగా 15 మిలియన్ల పాక్ రూపాయల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నాయి.

More Telugu News