Rohit Sharma: ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్‌పై రోహిత్ అసహనం.. ఈ వీడియో చూశారా?

Rohit sharma angry over Kuldeep in match against england for not taking review
  • 22వ ఓవర్‌లో లివింగ్‌స్టోన్ ఎల్‌బీడబ్ల్యూకి రివ్యూ కోరని కుల్దీప్
  • రీప్లేలో ఔట్ తేలడంతో ఆగ్రహించిన కెప్టెన్ రోహిత్
  • సమాధానం లేక మౌనంగా ఉండిపోయిన కుల్దీప్ యాదవ్
బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ రాణించడం, బౌలింగ్‌లో పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ చెలరేగడంతో లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచి సెమీస్‌ స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేయడంలో పేస్ బౌలర్లతోపాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించారు. 

ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ 2 ముఖ్యమైన వికెట్లు తీసి శెభాష్ అనిపించుకున్నాడు. అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక సందర్భంలో కుల్దీప్‌పై అసహనం వ్యక్తం చేశాడు. ఎందుకంటే మ్యాచ్‌లో 22వ ఓవర్‌ను కుల్దీప్ వేశాడు.  ఈ ఓవర్‌లో ఒక డెలివరీ క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న లివింగ్‌స్టోన్ ప్యాడ్‌పై వికెట్ల ముందు తాకింది. అయితే దీనిపై టీమిండియా ఆటగాళ్లు పెద్దగా అప్పీల్ చేయలేదు. రివ్యూ కూడా కోరలేదు. అయితే తర్వాత గ్రౌండ్‌లోని బిగ్ స్ర్కిన్‌పై రీప్లేలో ఇది ఔట్‌గా తేలింది.  

రీప్లేలో ఔట్‌గా తేలడాన్ని గమనించిన రోహిత్ శర్మ కుల్దీప్ వైపు నడిచివెళ్లాడు. రివ్యూ తీసుకోనందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రివ్యూ ఎందుకు కోరలేదన్నట్టుగా రుసరుసలాడాడు. జాగ్రత్తగా ఉండాలని, అతడు విజయాన్ని లాగేసుకోగలడని సూచించాడు. అయితే కుల్దీప్ దగ్గర సమాధానం లేకపోవడంతో ఏమీ మాట్లాడలేదు. తన స్థానంవైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rohit Sharma
Cricket

More Telugu News