Jagan: రైలు ప్రమాదం పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది: సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

  • విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి రైలు ప్రమాదం
  • ఆగివున్న రైలును ఢీకొట్టిన మరో రైలు
  • 13 మంది వరకు మృతి... పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గాయాలు
  • విజయనగరం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్
  • ఘటన స్థలిపై ఏరియల్ వ్యూ
CM Jagan raises questions on Vijayanagaram train accident

ఏపీ సీఎం జగన్ నేడు విజయనగరం జిల్లా రైలు ప్రమాద బాధితులను పరామర్శించారు. రైళ్లు ఢీకొన్న ఘటన స్థలిని హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు. గత రాత్రి విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం తనకు తీవ్రమైన వేదన కలిగించిందని వెల్లడించారు. నడుస్తున్న ఓ రైలు ఆగివున్న మరో రైలును ఢీకొట్టిందని, ఆ రెండు రైళ్లూ ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయని తెలిపారు. అయితే ఈ భయానక రైలు ప్రమాద ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. 

1. ఆ సమయంలో బ్రేకింగ్ సిస్టమ్, అలర్ట్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు?
2. సిగ్నలింగ్ వ్యవస్థ ఎందుకు విఫలమైంది?
3. కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా పనిచేయకుండా పోయింది?
... అంటూ సీఎం జగన్ ప్రశ్నలు సంధించారు.

"ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరిపిస్తారని కోరుతున్నాను. లేవనెత్తిన అంశాలపై లోతైన పరిశీలన చేపడతారని ఆశిస్తున్నాను.  ఈ లైన్లోనే కాదు, దేశంలోని అన్ని లైన్లలో భవిష్యత్తులో ఇటువంటి ఘోర ప్రమాదాలు జరగకుండా నివారిస్తారని ఆకాంక్షిస్తున్నాను" అని సీఎం జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. రైలు ప్రమాద ఘటనలో అయిన వారిని పోగొట్టుకున్న వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని, క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

More Telugu News