Komatireddy Venkat Reddy: హరీశ్ రావుపై పోటీ చేయడానికి నేను సిద్ధం: కోమటిరెడ్డి వెంకటరెడ్డి

I am ready to contest on Harish Rao says Komatireddy Venkat Reddy
  • రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని కోమటిరెడ్డి విమర్శ
  • రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని మండిపాటు
  • నియంత పాలనకు చరమగీతం పలికేందుకే నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శ
తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. నల్గొండ జిల్లాలోని అన్ని స్థానాల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని... అయితే, ఇలాంటి ప్రయోగాలు జరిగే అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను చూసేందుకు బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆ రాష్ట్రంలో పర్యటిస్తానని తెలిపారు. కర్ణాటక ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను చూసేందుకు, వాటి గురించి తెలుసుకునేందుకు తెలంగాణ నుంచి ఎవరైనా రావచ్చని చెప్పారు. అక్కడి సంక్షేమ పథకాలపై ఎవరైనా అసంతృప్తిని వ్యక్తం చేస్తే... లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమేనని అన్నారు. 

ఈ తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. రూ. 5 లక్షల కోట్ల అప్పులు చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పలికేందుకే వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలను ప్రతి గ్రామంలో ప్రచారం చేసి రాష్ట్రంలో ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.
Komatireddy Venkat Reddy
Congress
KCR
BRS
Harish Rao

More Telugu News