Ravichandran Ashwin: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో కొంపదీసి అశ్విన్‌ను ఆడించరు కదా.. ఆకాశ్‌చోప్రా షాకింగ్ కామెంట్స్

  • అశ్విన్‌ను ఆడించాలనుకోవడం మంచి నిర్ణయం అంటూనే వద్దన్న ఆకాశ్ చోప్రా
  • ఇది ఐపీఎల్ పిచ్ కాదని హెచ్చరిక
  • బంతి బౌన్స్ అవుతూ పేస్‌కు అనుకూలిస్తుందన్న మాజీ క్రికెటర్ 
  • అశ్విన్‌ను ఆడించి తప్పు చేయొద్దని సలహా
Aakash Chopra Sensational Comments On R Ashwin

ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న టీమిండియా మరికాసేపట్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. స్పిన్‌కు అనుకూలించే లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత జట్టు పలు మార్పులు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా టాప్ ఆఫ్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని యోచిస్తోంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆడిన అశ్విన్ ఆ తర్వాత బెంచ్‌కే పరిమితమయ్యాడు. 

అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోబోతున్నట్టు వస్తున్న వార్తలపై టీమిండియా మాజీ క్రికెటర్ అశోక్ చోప్రా స్పందించాడు. అశ్విన్‌ను ఆడించే ఆలోచన ఏమైనా ఉంటే మానుకోవాలని హితవు పలికాడు. ప్రపంచకప్‌ జరుగుతున్న పిచ్‌లు ఐపీఎల్ పిచ్‌లు లాంటివి కావన్న విషయాన్ని గుర్తెరగాలని తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. అశ్విన్‌ను ఎంచుకుని ప్రత్యర్థుల చేతికి చిక్కొద్దని సలహా ఇచ్చాడు. 

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలనుకోవడం మంచి నిర్ణయమే అయినా ఇప్పుడు మాత్రం అది సరైన నిర్ణయం అనిపించుకోదన్నాడు. ఐపీఎల్‌లో ఆడినట్టు లక్నో నల్లమట్టి పిచ్ కాదని, అది ఎర్రమట్టి పిచ్ అని ఆకాశ్ గుర్తు చేశాడు. ఇక్కడ  బంతి పేస్‌కు అనుకూలిస్తూ బౌన్స్ అవుతుందని వివరించాడు. 

మ్యాచ్ రెండోభాగంలో ఫీల్డింగ్ చేయాల్సి వస్తే కనుక ముగ్గురు స్పిన్నర్లను ఆడిస్తే అది ప్రమాదమే అవుతుందని, బంతి వెట్‌గా అయిపోయి మ్యాచ్ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్తుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. అలాగే, ఫామ్‌లో సిరాజ్‌తో పోలిస్తే షమీ ముందున్నాడు కాబట్టి తుది జట్టులో అతడికి స్థానం కల్పించాలని సూచించాడు.

More Telugu News