vivek venkataswami: మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నారా?

  • వివేక్ ను కలిసి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు
  • శనివారం వివేక్ తో రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు భేటీ
  • పార్టీలోకి తిరిగి రావాలంటూ పిలుపు
BJP Leader Vivek Venkata Swamy Is Goinig To Join In Congress

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే పార్టీలు ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై ఆయా పార్టీల్లో అంతర్గతంగా గొడవలు జరుగుతున్నాయి. టికెట్ దక్కని నేతల అలకలు, మీడియా, అనుచరుల ముందు కన్నీటి పర్యంతమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఓవైపు అసంతృప్త నేతలకు సీనియర్ నేతల బుజ్జగింపుల పర్వం కొనసాగుతుండగా మరోవైపు ఇతర పార్టీల్లో టికెట్ దక్కని నేతలను పలు పార్టీలు తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాయి.

దీనికి అదనంగా కాంగ్రెస్ పార్టీ ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం చేపట్టింది. గతంలో కాంగ్రెస్ లో సేవలందించి ఇతర పార్టీల్లో చేరిన నేతలను సొంతగూటికి రప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత నాయకుడు గడ్డం వెంకటస్వామి కుమారుడు వివేక్ వెంకటస్వామిని తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. 

శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ ప్రచార వ్యూహకర్త సునీల్ కనుగోలుతో కలిసి వివేక్ వెంకటస్వామితో భేటీ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వివేక్ ను కాంగ్రెస్ లో చేరాలంటూ రేవంత్ ఆహ్వానించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ విషయంపై ముగ్గురి మధ్య సుదీర్ఘంగా చర్చ జరిగింది. అయితే, ఈ భేటీలో వివేక్ ఏ విషయమూ చెప్పలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి అసంతృప్తితో ఉన్నారని, వారు పార్టీ మారుతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని వివేక్ కొట్టిపారేశారు. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా వివేక్ ను కూడా కాంగ్రెస్ లో చేర్చుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.

More Telugu News