Bangladesh: నెదర్లాండ్స్‌పై ఎందుకు ఓడామంటే.. నా దగ్గర సమాధానం లేదు: బంగ్లాదేశ్ కెప్టెన్

  • నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో దారుణంగా ఓడిన బంగ్లాదేశ్
  • ప్రదర్శన కంటే కూడా తమది మెరుగైన జట్టేనన్న షకీబల్
  • ఓటమికి ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదని స్పష్టీకరణ
We are a better team than our performance Says Bangladesh Skipper Shakib

నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైంది. డచ్ జట్టు నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 142 పరుగులకే కుప్పకూలింది. టోర్నీలో బంగ్లాకు ఇది వరుసగా ఐదో పరాజయం. ఈ ఓటమితో బంగ్లాదేశ్ కథ ముగిసింది. 

ప్రారంభ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ ఆ తర్వాత చతికిలపడింది. 2007 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ ప్రతి టోర్నీలోనూ మూడేసి గేమ్స్ గెలిచింది. అయితే, ఈసారి మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ తన తర్వాతి మ్యాచుల్లో బలమైన పాకిస్థాన్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది.

నెదర్లాండ్స్‌పై జరిగిన ఘోర పరాభవంపై తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ మాట్లాడుతూ.. ఈ పరాజయం తమను అసంతృప్తికి గురిచేసిందని పేర్కొన్నాడు. తామెందుకు ఇలా ఆడామన్న దానిపై తన వద్ద సరైన సమాధానం లేదన్నాడు. ‘‘నేను ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదు. మా ప్రదర్శన కంటే కూడా మాది మెరుగైన జట్టే. డ్రెస్సింగ్ రూం మొత్తం అంగీకరించే విషయం ఇదే’’ అని పేర్కొన్నాడు. అసలు తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపై కారణం వెతుకుతున్నట్టు చెప్పాడు. 

24 సంవత్సరాలుగా సెమీఫైనల్ ఆడకపోవడం తమను తీవ్ర నిరాశకు గురిచేస్తోందని షకీబల్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ ప్రజలు క్రికెట్‌పై చూపుతున్న ఆదరాభిమానాలను బట్టి తాము మరింత మెరుగ్గా ఆడాల్సి ఉందని పేర్కొన్నాడు.  మహ్ముదుల్లా, ముష్ఫికర్ రహీం మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారని అన్నాడు. 

అంచనాలకు మించి రాణించలేకపోయామని చెప్పాడు. మేం బౌలింగ్ బాగానే చేశామని అనుకుంటున్నా. ఫీల్డ్‌లో చాలా స్లోగా ఉన్నాం. వారిని (నెదర్లాండ్స్)ను 170-180 పరుగులకే కట్టడి చేయొచ్చని, కానీ 230 పరుగులు ఛేదించాల్సి వచ్చిందని వివరించాడు. కాగా, దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన మహ్ముదుల్లాను నెదర్లాండ్స్‌పై ఏడో స్థానంలో దించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

More Telugu News