Telangana: కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదన్న మంత్రి కేటీఆర్

  • డీకే శివకుమార్ పై తీవ్రంగా మండిపడ్డ బీఆర్ఎస్ లీడర్
  • అన్న భాగ్య స్కీమ్ అటకెక్కింది, గృహజ్యోతి పథకం ఆరిపోయిందని వ్యంగ్యం
  • కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ రైతులే ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నారని వెల్లడి
Telangana Minister Fires On Karnataka Dy CM DK

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణకు వచ్చి కర్ణాటకలో 5 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదమని కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ ను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ పలు విమర్శలు చేశారు. కర్ణాటకలో తమ పరిస్థితి ఎలా ఉందనేది చూసేందుకు అక్కడి దాకా వెళ్లాల్సిన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ చేతిలో దగా పడ్డ రైతులే తెలంగాణకు వచ్చి మీరు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారని చెప్పారు. 

సమస్యలతో సతమతమవుతున్న కర్ణాటక రైతులను గాలికి వదిలేసి తెలంగాణలో ఓట్ల వేటకు వచ్చిన డీకే శివకుమార్ ను రెండు రాష్ట్రాల రైతులు క్షమించరని కేటీఆర్ చెప్పారు. ఐదు హామీలంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, తీరా గద్దెనెక్కిన తర్వాత కొర్రీల మీద కొర్రీలు పెడుతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. అన్న భాగ్య స్కీమ్ అటకెక్కిందని, గృహజ్యోతి పథకం ఆరిపోయిందని ఆరోపించారు.

ఎన్నికల హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ను కర్ణాటక క్షమించదు.. తెలంగాణ విశ్వసించదని కేటీఆర్ స్పష్టం చేశారు. రేషన్ పై కూడా సన్నబియ్యం ఇవ్వాలన్న బీఆర్ఎస్ ప్రభుత్వ సంకల్పాన్ని, కనీసం రేషన్ బియ్యం కూడా ఇవ్వలేని కాంగ్రెస్ అసమర్థ పాలనకు మధ్య తేడాను తెలంగాణ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు.

More Telugu News