K Kavitha: చంద్రబాబుకు అలా జరగడం దురదృష్టకరం... ఆ కుటుంబం బాధను అర్థం చేసుకోగలను: ఎమ్మెల్సీ కవిత

Kavitha on chandrababu arrest
  • నెటిజన్ల ప్రశ్నలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమాధానాలు
  • సర్వేల్లో ప్రతిపక్షాలు గెలిస్తే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందన్న కవిత
  • ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదని వెల్లడి
  • బీఆర్ఎస్‌కు 95 నుంచి 105 సీట్లు వస్తాయన్న కవిత
  • తనకు ఇష్టమైన నటుడు చిరంజీవి, ఆ తర్వాత అల్లు అర్జున్ అన్న కవిత
సర్వేలలో ప్రతిపక్షాలు గెలిస్తే, ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం బీఆర్ఎస్ గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆమె శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. కేంద్రమంత్రి అమిత్ షా బీసీ ముఖ్యమంత్రి అని ప్రకటించడం కేవలం ఎన్నికల గిమ్మిక్కు అన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తుందన్నారు. హంగ్‌కు ఎలాంటి ఆస్కారం లేదన్నారు. 2018లోనూ ఇలాగే చేశారన్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన పాత్ర ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి డీల్ లేదన్నారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలంగాణతో వారి కుటుంబానికి సంబంధం ఉందని, కానీ అదేమిటంటే తెలంగాణ ప్రజలను పదేపదే మోసం చేయడమన్నారు. 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. కేసీఆర్ తర్వాత తనకు ఇష్టమైన రాజకీయ నేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని చెప్పారు.

చిరంజీవికి అభిమానిని

తాను మెగాస్టార్ చిరంజీవికి అభిమానిని అని కవిత చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు అభిమానిని అన్నారు.

చంద్రబాబు అరెస్ట్‌పై ప్రశ్నకు కవిత సమాధానం

చంద్రబాబు అరెస్టుపై మీ సమాధానం ఏమిటి? అని ఓ నెటిజన్ అడగగా.. ఈ వయస్సులో ఆయనకు అలా జరగడం దురదృష్టకరమన్నారు. ఆయన కుటుంబం పడుతున్న బాధను తాను అర్థం చేసుకోగలనన్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నానన్నారు.
K Kavitha
Chandrababu
Telangana Assembly Election
BRS

More Telugu News