Chalamala Krishna Reddy: కాంగ్రెస్‌లో టిక్కెట్ రావాలంటే ఈ మూడు క్వాలిటీలు ఉండాలి... మునుగోడులో బరిలో నిలుస్తా: చలమల కృష్ణారెడ్డి

  • కోమటిరెడ్డి రాత్రికి రాత్రి తమ్ముడ్ని తీసుకు వచ్చి టిక్కెట్ ఇప్పించుకున్నారన్న కృష్ణారెడ్డి 
  • లీడర్లకు సలాం కొట్టడం, గాంధీ భవన్లో ప్రెస్ మీట్, ఢిల్లీలో పైరవీలు.. ఈ మూడు ఉంటేనే కాంగ్రెస్‌లో టిక్కెట్ వస్తుందని ఎద్దేవా
  • కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ తనకు టిక్కెట్ రాకుండా చేశారని ఆరోపణ
  • తాను రేవంత్ రెడ్డి వర్గం నేతను కాబట్టి అడ్డుకున్నారన్న చలమల
Chalamala Krishna Reddy fires at Komatireddy and Uttam

కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాత్రికి రాత్రి తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చి బీఫామ్ ఇప్పించుకున్నాడని, అయినా తాను మునుగోడు ఎన్నికల బరిలో పక్కాగా ఉంటానని చలమల కృష్ణారెడ్డి అన్నారు. తనకు మునుగోడు టిక్కెట్ రాకపోవడంతో తన అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ మారింది.. ముసలివాళ్ల రాజ్యం నడవదని భావించానని, కానీ ఇప్పటికీ వారిదే నడుస్తోందన్నారు. సర్వే ఆధారంగా టిక్కెట్ వస్తుందనుకుంటే, తనకు వస్తుందని భావించానన్నారు. కాంగ్రెస్‌లో జోకిన వాడికే టిక్కెట్ ఇస్తారని మరోసారి తేలిందన్నారు. తనకు కాంగ్రెస్ గుణపాఠం చెప్పిందన్నారు.

కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ రావాలంటే మూడు క్వాలిటీలు ఉండాలని తనకు ఈ రోజు అర్థమైందని, ఒకటి... పొద్దున లేస్తే లీడర్ల వద్దకు వెళ్లి సలాం కొట్టాలని, రెండు... గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టాలని, మూడోది... ఢిల్లీకి వెళ్లి పైరవీలు చేయాలన్నారు. ఈ మూడు క్వాలిటీలు ఉంటే కాంగ్రెస్‌లో టిక్కెట్ వస్తుందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిస్వార్థపరుడు అనుకున్నానని, కానీ రాజగోపాల్ రెడ్డిని పిలిపించుకొని టిక్కెట్ ఇస్తే ఆయన స్వార్థం అర్థమైందన్నారు. తాను 16 నెలల పాటు మునుగోడులో నిస్వార్థంగా పని చేస్తూ వచ్చానన్నారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పాల్వాయి స్రవంతిలు తనకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారన్నారు. అసలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఉత్తమ్ కుమార్ ఏం చేశారు? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఉప ఎన్నికల్లో గెలిచి ఉంటే వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్లి ఉండేవారు కాదా? అని నిలదీశారు. తాను ఇలా ప్రశ్నించినందుకు సస్పెండ్ చేస్తారేమో? అయినా భయపడేది లేదన్నారు. తాను పదవుల కోసం, పైసల కోసం రాలేదన్నారు. కొంతమంది ఎంగిలి కుక్కలు వారికి టిక్కెట్ రాకపోయినా పర్లేదు కానీ చలమల కృష్ణారెడ్డికి రావొద్దని... కోమటిరెడ్డికి ఇవ్వమని లేఖలు రాశారన్నారు.

మీ అందరి సూచన మేరకు తాను ముందుకు వెళ్తానని తన అనుచరులను ఉద్దేశించి చలమల కోరారు. కానీ మునుగోడు బరిలో నిలవడం మాత్రం ఖాయమన్నారు. ఢిల్లీ పెద్దలు తనకు ఫోన్ చేసినా బెండ్ కాలేదన్నారు. వాస్తవానికి తన పేరు మొదటి జాబితాలోనే ఉందని, కానీ కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి తన పేరును రెండో జాబితాలోకి మార్చారని, ఆ తర్వాత మూడో జాబితాలోకి మార్చారన్నారు. కానీ నిన్న అధిష్ఠానాన్ని బలవంతంగా ఒప్పించి, తన పేరును తొలగించి, రాజగోపాల్ రెడ్డి పేరును తెరపైకి తెచ్చారన్నారు.

తనపై వారికి ఉన్న కోపానికి కారణం ఒకటేనని, అది తాను రేవంత్ రెడ్డి వర్గం కావడమన్నారు. ఎక్కడా రేవంత్ వర్గం నాయకులు గెలవకూడదని వారు కోరుకుంటున్నారన్నారు. అందుకే తమను బలిపశువులను చేస్తున్నారన్నారు. కోమటిరెడ్డి సోదరులు, ఉత్తమ్ వంటి వారు మళ్లీ గెలిస్తే కాంగ్రెస్‌లో కుమ్ములాటలు తిరిగి ప్రారంభమవుతాయన్నారు. వీరు గెలిచాక కాంగ్రెస్ నుంచి అయ్యే సీఎంకు మనశ్శాంతి   ఉండదన్నారు.

బీజేపీ తంతే రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చాడని విమర్శించారు. నల్గొండలో కాంగ్రెస్ పెద్దలు కొంతమంది సీట్లను త్యాగం చేయాలన్నారు. అన్నదమ్ములు, భార్యాభర్తలకు టిక్కెట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కట్రలు చేసి 48 గంటల్లో తన పేరును తొలగించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉత్తమ్, కోమటిరెడ్డి లాంటి వారు క్యాన్సర్ లాంటి వాళ్లన్నారు. తాను రేవంత్ మనిషిని అనే కోపం మాత్రమే వారికి ఉందన్నారు.

More Telugu News