Juno: భీతిగొలిపేలా ఉన్న గురు గ్రహం ఉత్తర ధ్రువం... నాసా ఆసక్తికర ఫొటో ఇదిగో!

  • గురు గ్రహంపై పరిశోధనల కోసం 2011లో జునో ప్రయోగం
  • 2016లో బృహస్పతి కక్ష్యలోకి ప్రవేశించిన జునో
  • ఇటీవల 54వ సారి గురు గ్రహానికి సమీపంలోకి వెళ్లిన వైనం
NASA shares Jupiter north pole picture captured by Juno

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గురు గ్రహంపై పరిశోధనల నిమిత్తం రోదసిలోకి జునో అనే స్పేస్ క్రాఫ్ట్ ను పంపింది. 2011లో రోదసిలోకి దూసుకెళ్లిన ఈ వ్యోమనౌక 2016లో గురు గ్రహం కక్ష్యలోకి ప్రవేశించింది. జునో తాజాగా పంపిన ఫొటో బృహస్పతి ముఖాకృతి ఎంత భయానకంగా ఉందో చెబుతోంది. 

ఈ ఫొటో గురు గ్రహం ఉత్తర ధ్రువానికి సంబంధించినది. ఒక భీకరమైన రాక్షస ముఖంగా గురు గ్రహం ఉత్తర ధ్రువం ఈ ఫొటోలో దర్శనమిస్తోంది. ఈ ఫొటోలో బృహస్పతిపై సగం చీకటి, సగం వెలుతురు ఉండడాన్ని చూడొచ్చు. అంతేకాదు, గురుగ్రహం ఉపరితలంపై భయంకరమైన తుపాను వలయాలు ఆవృతమై ఉన్నాయి. 

సూర్యకాంతి గురుగ్రహంపై పడే కోణం నుంచి ఈ ఫొటోను జునో క్లిక్ మనిపించింది. గురు గ్రహం కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఈ అంతరిక్ష నౌక ఇటీవల 54వ పర్యాయం గురుగ్రహానికి సమీపంలోకి వెళ్లినప్పుడు ఈ ఫొటో తీసింది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఈ ఫొటోలోని అంశాలను విశ్లేషించే పనిలో పడ్డారు.

More Telugu News