Harish Rao: వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయం: హరీశ్ రావు

  • ఢిల్లీ అహంకారం కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలా? అన్న హరీశ్ రావు  
  • డీకే శివకుమార్ ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారని నిలదీత
  • అదిలాబాద్ టిక్కెట్ ఎంతకు అమ్మారో కాంగ్రెస్ వారే చెబుతున్నారన్న హరీశ్ రావు
  • ఓటుకు నోటు దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అని ప్రశ్న
Harish Rao blames congress in adilabad election campaign

ఢిల్లీ అహంకారం కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం కావాలా? తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం అదిలాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ... మహారాష్ట్రలో 7 గంటలు విద్యుత్ ఇస్తున్నారని, కర్ణాటకలో 3 గంటలే ఇస్తున్నారని, అలాంటప్పుడు కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇక్కడకు వచ్చి ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డ కావాలా? ఢిల్లీ గడ్డ కావాలా? అన్నారు.

అదిలాబాద్‌లో ఆరెస్సెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్ కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మాత్రం సెంచరీ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లను అమ్ముకుందని ఆరోపించారు. అదిలాబాద్ టిక్కెట్ ఎంతకు అమ్మారో చెబుతూ, కాంగ్రెస్ పార్టీ వారే విమర్శలు చేస్తున్నారన్నారు. టిక్కెట్లను అమ్ముకునే వారి చేతికి అధికారం ఇస్తే రాష్ట్రాన్నీ అమ్మేస్తారన్నారు.

ఓటుకు నోటు దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెడతారా? అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ రాలేదని ముష్టి యుద్ధాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్ అంటే నమ్మకం... కాంగ్రెస్ అంటే ఒక బూటకం అన్నారు. కేసీఆర్ చావునోట్లో తల పెట్టి తెలంగాణ తెచ్చారన్నారు. ఇంటింటికి నల్లా ఇచ్చామన్నారు. కుర్చీ కోసం కొట్లాడే నాయకులకు ఓటేద్దామా? లేక మన భవిష్యత్తు కోసం ఓటు వేద్దామా? అని హరీశ్ రావు అడిగారు.

More Telugu News