babu mohan: పోటీకి.. బీజేపీకి దూరంగా ఉంటున్నాను: బాబూ మోహన్ కీలక ప్రకటన

  • తాను ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఫోన్ ఎత్తడం లేదన్న బాబూ మోహన్
  • నా కొడుక్కి టిక్కెట్ అంటూ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నమని ఆగ్రహం
  • నా కొడుక్కి ఇచ్చినా దాపరికం ఎందుకు.. ఆ విషయం నాకు చెప్పాలి కదా? అని ప్రశ్న
  • అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి పార్టీలో ఉండాలా? రాజీనామా చేయాలా? అనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడి
Babu Mohan says he will not contest ts election

తన పాప్యులారిటీ గురించి తెలియదా? తానెవరో తెలియదా? తనను ఎన్నో జాబితాలో పెడతారు? అయినా తాను ఈసారి పోటీకి దూరంగా ఉండాలనుకున్నానని బీజేపీ నేత, సినీ నటుడు బాబూ మోహన్ అన్నారు. తన పేరు మొదటి జాబితాలో లేకపోవడంపై ఆయన పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదల్చుకోలేదన్నారు. బీజేపీకీ దూరంగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. తాను ఫోన్ చేసినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. తన కుమారుడికి టిక్కెట్ ఇస్తున్నామని చెబుతూ కుటుంబంలో చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అధిష్ఠానం స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందన్నారు.

వరుస జాబితాల పేరుతో దాపరికం తనకు నచ్చడం లేదన్నారు. పార్టీ రాష్ట్ర పెద్దలు కావాలని తనను పక్కన పెడుతున్నట్లుగా అనిపించిందన్నారు. టిక్కెట్ ఎవరికైనా ఇచ్చుకోనీయండి.. మా అబ్బాయికి అంటున్నారు.. నా కొడుక్కే ఇవ్వండి.. కానీ అది తనకు నేరుగా చెప్పాలి కదా? అని బాబూ మోహన్ అన్నారు. నాన్చుడు ధోరణి సరికాదన్నారు. నేను అందరికీ తెలిసిన వ్యక్తిని అని, అలాంటి తనను ఎన్నో జాబితాలో పెడతారని ప్రశ్నించారు. అందుకే బాధతో పార్టీకి, పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి పార్టీలో ఉండాలా? రాజీనామా చేయాలా? చూస్తానన్నారు.

More Telugu News