Champapet: యువతి గొంతు కోసి చంపి.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు

  • హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఓ యువకుడి ఘాతుకం
  • అన్నాచెల్లెళ్లమంటూ గది అద్దెకు తీసుకున్నారన్న యజమాని
  • యువతితో పాటు మరో యువకుడి మకాం 
  • అన్న మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోయేవాడని వెల్లడి
Teenage girl Murdered In champapet

హైదరాబాద్ లోని చంపాపేట్ లో శనివారం దారుణం జరిగింది. ఓ యువతి గొంతు కోసం చంపిన యువకుడు.. తర్వాత తనూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. మేడ పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చుట్టుపక్కల వారు ఆ యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమాని, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నా చెల్లెళ్లమని చెప్పి హన్మంతు అనే యువకుడు, ఓ యువతి గదిని అద్దెకు తీసుకున్నారు. హన్మంతు అప్పుడప్పుడూ వస్తూ పోతుండగా.. యువతితో పాటు మరో యువకుడు ఉండేవాడు.

ఈ క్రమంలో శనివారం ఉదయం ఏం జరిగిందో ఏమో కానీ, ప్రేమ్ కుమార్ అనే యువకుడు గదిలోని యువతి గొంతు కోసి హత్య చేశాడు. ఆపై బంగ్లా పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నాడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News