Elon Musk: ‘ఎక్స్’ను డేటింగ్ యాప్‌గా మార్చబోతున్న ఎలాన్ మస్క్.. సిద్ధమవుతున్న ప్రణాళికలు!

  • అదనపు ఆదాయ మార్గాలే మస్క్ లక్ష్యం
  • డిజిటల్ బ్యాంకింగ్ సేవలూ అందుబాటులోకి తెచ్చే యోచన
  • ‘ఎక్స్’ వార్షికోత్సవం సందర్భంగా వెల్లడి
Elon Musk reveals plans to turn X  into a dating app

రికార్డు స్థాయిలో ఏకంగా 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ఏడాది క్రితం కొనుగోలు చేసిన ట్విట్టర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్’) ద్వారా అదనపు ఆదాయాన్ని పొందాలని అధినేత ఎలాన్ మస్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఎక్స్ యాప్‌పై ప్రత్యేకంగా డేటింగ్ ఫీచర్‌ జోడించాలని ఆయన భావిస్తున్నట్టు కంపెనీ అంతర్గతవర్గాలు పేర్కొన్నాయి. అయితే ఒకే సైట్‌పై డేటింగ్ ఫీచర్‌ను ఎలా అందుబాటులోకి తీసుకొస్తారనే వివరాలు తెలియరాలేదు.

ట్విట్టర్‌ వార్షికోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన వీడియో కాల్‌లో ఎలాన్ మస్క్ తన ప్రణాళికలను వెల్లడించినట్టు పలు రిపోర్టులు పేర్కొన్నాయి. 2024 నాటికల్లా ఈ డేటింగ్ ఫీచర్‌ని తీసుకురావొచ్చని తెలుస్తోంది. డేటింగ్ ఫీచర్‌తోపాటు ‘ఎక్స్’పై డిజిటల్ బ్యాంకింగ్ ఫీచర్ తీసుకురావాలని మస్క్ భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ‘ఎక్స్’ను ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చాలని భావిస్తున్నట్లు గతంలో ఓ సందర్భంలో పేర్కొన్న విషయం తెలిసిందే. మరిన్ని కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడమే ఆయన లక్ష్యంగా ఉంది. 

కాగా ట్విట్టర్‌ ను ఏడాదిక్రితం ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. అక్టోబర్ 2022‌లో 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. జులైలో ‘ఎక్స్’గా రీబ్రాండ్ చేశారు. ఉద్యోగుల తొలగింపు, వినియోగదారుల అకౌంట్ల తొలగింపు, ఆ తర్వాత పునరుద్ధరణ, బ్లూ టిక్‌కి ఫీజు వంటి చర్యలు వార్తల్లో నిలిచాయి. తద్వారా ఎక్స్‌కు ప్రకటనదారులు దూరంగా జరిగారు. మొత్తంగా ఈ ప్లాట్‌ఫామ్ విలువ సగానికి సగం దిగజారింది. ట్విట్టర్‌ బ్రాండ్ తొలగింపు ద్వారా దీని విలువ 20 బిలియన్ డాలర్ల మేర క్షీణించిందని ఫోర్బ్స్ రిపోర్ట్ అంచనా వేసింది. డబ్బు చెల్లించి వాడుకోగలిగే కస్టమర్లను మాత్రమే కలిగివుందన్న కారణాన్ని ప్రస్తావించింది. కాగా యూజర్లు ఏం కోరుకుంటున్నారో ఆ విషయం అధినేత మస్క్‌కి అర్థంకావడంలేదని కంపెనీకి చెందిన ఒకరు వాపోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

More Telugu News