Bangladesh: భర్తను, కొడుకును వదిలేసి.. ప్రియుడి కోసం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్ మహిళ!

  • ఉత్తర త్రిపుర జిల్లా ధర్మనగర్‌లో నూర్ జలాల్ అనే వ్యక్తితో సహజీవనం
  • సమాచారం అందుకుని అరెస్ట్ చేసిన పోలీసులు
  • 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు
A Bangladeshi woman illegally entered India for her boyfriend

పెళ్లై, పిల్లాడు పుట్టాక ఓ మహిళ ప్రేమలో పడింది. అంతేకాదు, భర్త, పిల్లాడిని వదిలిపెట్టి ప్రియుడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం అంతర్జాతీయ సరిహద్దును కూడా దాటేసింది. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. చివరకు కటకటాలపాలైంది. ఉత్తర త్రిపుర జిల్లా ధర్మనగర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి, ధర్మనగర్ సబ్ డివిజన్ పరిధిలోని ఫుల్‌బరీ‌లో ఒక మహిళ నివాసం ఉంటోందన్న సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. భారతీయుడు, ధర్మనగర్ స్థానికవాసి నూర్ జలాల్(34) అనే ఆయుర్వేద వైద్యుడితో సహజీవనం చేస్తూ ఇక్కడే నివసిస్తోందని గుర్తించారు. నిందితురాలి పేరు ఫతేమా నుస్రత్ అని, అక్రమంగా ప్రవేశించినందుకు కేసు నమోదు చేసి గురువారం అరెస్ట్ చేశామని పోలీసులు వెల్లడించారు. సదరు మహిళను 14 రోజలపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఆమెను పెళ్లి చేసుకున్న ఆయుర్వేద వైద్యుడు నూర్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

కాగా 34 ఏళ్ల నూర్ జలాల్ ఆయుర్వేద వృత్తి రీత్యా బంగ్లాదేశ్‌లోని మౌల్వీ మార్కెట్‌కు తరచుగా వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో ఫతేమా నుస్రత్‌తో అతడికి పరిచయం ఏర్పడింది. ఒకరినొకరు ఇష్టపడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అప్పటికే ఆమెకు పెళ్లై, ఒక కొడుకు ఉన్నా వారి నుంచి దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్టు బయటపడింది. కాగా ఈ మధ్య ప్రేమ కోసం దేశాల సరిహద్దులు అక్రమంగా దాటుతున్న ఘటనలు వెలుగుచూస్తున్న విషయం తెలిసిందే.

More Telugu News