Pakistan: సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఓటమి... చచ్చీచెడీ నెగ్గిన సఫారీలు

Pakistan loses to South Africa in a nail baiting thriller
  • చెన్నైలో దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్థాన్
  • 1 వికెట్ తేడాతో నెగ్గిన సఫారీలు
  • చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్
  • మార్ క్రమ్ 91 పరుగులు
  • షహీన్ అఫ్రిదికి 3 వికెట్లు... తలా రెండేసి వికెట్లు  తీసిన రవూఫ్, వసీం, మిర్
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. చివరికి దక్షిణాఫ్రికా 1 వికెట్ తేడాతో చచ్చీచెడీ నెగ్గింది. పాకిస్థాన్ చివర్లో దక్షిణాఫ్రికాపై విపరీతమైన ఒత్తిడి పెంచేసింది. ఇంకొక్క వికెట్ తీస్తే విజయం పాక్ వశమవుతుందనగా, దక్షిణాఫ్రికా చివరి వరుస బ్యాట్స్ మన్ కేశవ్ మహరాజ్ ఫోర్ కొట్టడంతో పాక్ కు తీవ్ర నిరాశ తప్పలేదు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో ఓ దశలో సఫారీలు మెరుగైన స్థితిలోనే ఉన్నారు. కానీ, ఒత్తిడికి లోనై వెంటవెంటనే వికెట్లు అప్పగించి పెవిలియన్ కు చేరారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన మార్ క్రమ్ 91 పరుగులు చేసి ఉసామా మిర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. డేవిడ్ మిల్లర్ 29, మార్కో యన్సెన్ 20 పరుగులు చేశారు. 

అయితే, షహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్ పథకం ప్రకారం బౌలింగ్ చేస్తూ మ్యాచ్ ను చివరి వరకు తీసుకొచ్చారు. కానీ 48వ ఓవర్ ను స్పిన్నర్ నవాజ్ కు ఇవ్వగా, అతడు రెండో బంతిని లెగ్ సైడ్ వేయడంతో కేశవ్ మహారాజ్ బౌండరీ కొట్టి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. 

ఈ మ్యాచ్ లో ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు దాదాపు అడుగంటిపోయాయి. మరోవైపు ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.
Pakistan
South Africa
Chennai
World Cup

More Telugu News