Nara Lokesh: "చంద్రబాబు చస్తాడు" అంటూ ఎంపీ గోరంట్ల చేసిన వ్యాఖ్యలపై నారా లోకేశ్ స్పందన

Nara Lokesh reacts to YCP MP Gorantla comments on Chandrababu
  • 2024లో జగనే సీఎం అవుతాడు, చంద్రబాబు చస్తాడు అంటూ గోరంట్ల వ్యాఖ్యలు
  • చంద్రబాబు అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయన్న లోకేశ్
  • గోరంట్ల మాటలతో చంద్రబాబు లేఖలోని అంశాలు నిజమేనని తేలాయని స్పష్టీకరణ
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రబాబు చస్తాడు... ఇది గ్యారెంటీ అంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. రోజులు గడిచే కొద్దీ చంద్రబాబు అక్రమ అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కుండబద్దలు కొట్టినట్టు చంద్రబాబుకు మరణ హెచ్చరిక జారీ చేశాడని, ఇటీవల ఆ ప్రసంగంలో ఎంపీ మాటలు వింటుంటే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని లోకేశ్ వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఉన్న కుట్ర పొరలు ఒక్కొక్కటీ విడిపోతున్నాయని స్పష్టం చేశారు. 

తనకు హాని తలపెడతారంటూ చంద్రబాబు నుంచి దిగ్భ్రాంతికర లేఖ వచ్చిందని, ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాటలతో దీని వెనుక ఎంతటి దుష్ట పన్నాగం ఉందో ఆవిష్కృతమైందని, చంద్రబాబు లేఖలోని అంశాలు నిజమేనని తేలాయని తెలిపారు. 

జరుగుతున్న పరిణామాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వం చంద్రబాబును కాపాడుతుందన్న నమ్మకం వారిలో ఏ మాత్రం లేదని లోకేశ్ స్పష్టం చేశారు.
Nara Lokesh
Gorantla Madhav
Chandrababu
TDP
YSRCP

More Telugu News