Kishan Reddy: కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం

Ex MLA KS Ratnam joins BJP in presence of Kishan Reddy
  • కేసీఆర్ కూడా తొలుత కాంగ్రెస్ లో పని చేశారన్న కిషన్ రెడ్డి
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రి పదవిని చేపట్టారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ కవల పిల్లలని విమర్శ
బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేత బీజేపీలో చేరారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్ఎస్ నియంతృత్వ పాలనను చూడలేకే కేఎస్ రత్నం బీజేపీలో చేరారని... ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కవల పిల్లలని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తొలుత కాంగ్రెస్ పార్టీలో పని చేశారని... ఈ విషయం రాహుల్ గాంధీకి తెలుసా? అని ప్రశ్నించారు. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేసీఆర్ కేంద్ర మంతి పదవిని కూడా పొందారని చెప్పారు. ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న చరిత్ర బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరి మంత్రులుగా కొనసాగుతున్నారని విమర్శించారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఎంఐఎం ఏ టీమ్ అని అన్నారు. ఈ రెండు పార్టీల కంట్రోల్ అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఉంటుందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెట్టాపట్టాలేసుకుని తిరిగాయని విమర్శించారు. బీఆర్ఎస్, ఎంఐఎంలతో బీజేపీ ఎప్పుడూ కలవదని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నియంతల నాయకత్వంలో నడిచే పార్టీలని విమర్శించారు. 

Kishan Reddy
KS Ratnam
BJP
KCR
BRS

More Telugu News