Accid Attack: రెండో తరగతి బాలికపై యాసిడ్ విసిరిన ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్‌పై వేటు

  • కర్ణాటకలోని జోడిచిక్కనహళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఘటన
  • తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రిలో చేర్చిన ఉపాధ్యాయుడు
  • ఉద్దేశపూర్వకంగా ఆ పనిచేయలేదన్న నిందితుడు
Headmaster suspended for throwing acid on girl student

8 ఏళ్ల బాలికపై యాసిడ్ విసిరి కిరాతకంగా వ్యవహరించిన కర్ణాటక ప్రభుత్వ స్కూలు ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. చిత్రదుర్గ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. జోడిచిక్కనహళ్లి ప్రభుత్వ పాఠశాల ఈ నెల 25న దసరా సెలవుల అనంతరం తెరుచుకుంది. రెండో తరగతి చదువుతున్న 8 సంవత్సరాల సించన సీనియర్లు శుభ్రం చేస్తున్న టాయిలెట్ల వద్దకు వెళ్లి నిల్చుంది. అక్కడికి వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హెడ్మాస్టర్ రంగస్వామి టాయిలెట్ల క్లీనింగ్ కోసం అక్కడ ఉంచిన యాసిడ్ బాటిల్ తీసుకుని ఆమెపై విసిరాడు. 

యాసిడ్‌తోపాటు అందులోని ఓ ప్యాకెట్‌లో ఉన్న పౌడర్ పడి బాలిక తీవ్రంగా గాయపడింది. అప్రమత్తమైన హెడ్మాస్టర్ రంగస్వామి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్చాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు రంగస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై రంగస్వామి మాట్లాడుతూ.. తాను ఉద్దేశపూర్వకంగా ఆమెపై యాసిడ్ విసరలేదని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News