CM KCR: కొంతమంది ఇప్పుడొచ్చి కొడంగల్ కు రా, గాంధీ భవన్ కు రా అని సవాళ్లు విసురుతున్నారు: సీఎం కేసీఆర్

  • ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్న సీఎం కేసీఆర్
  • ఇవాళ అచ్చంపేటలో ప్రజాశీర్వాద సభ
  • రాజకీయం అంటే సవాళ్లు విసరడం కాదన్న తెలంగాణ సీఎం
  • తెలంగాణ ఎవరి వల్ల బాగుపడిందో చూసి ఓటేయాలని విజ్ఞప్తి 
CM KCR attends Atchampet rally

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ప్రజాశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తెలంగాణను ఓ రాష్ట్రంలా చూడాలని 24 ఏళ్ల కిందట ప్రస్థానం ఆరంభించానని వెల్లడించారు. కొంతమంది ఇప్పుడొచ్చి కేసీఆర్ కు దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారని... కొడంగల్ కు రా, గాంధీభవన్ కు రా అని సవాళ్లు విసురుతున్నారని అన్నారు. కేసీఆర్ దమ్మేంటో ప్రపంచం మొత్తానికి తెలుసని అన్నారు. రాజకీయం అంటే ఇలాంటి సవాళ్లు మాత్రమేనా? అని ప్రశ్నించారు. 

తెలంగాణ కోసం చకోర పక్షిలా ఒక్కడినే తిరిగానని వెల్లడించారు. ఇప్పటిదాకా నేను పోరాటం చేశా... ఇకపై పోరాటం చేయాల్సింది ప్రజలేనని పిలుపునిచ్చారు. ఈసారి ఎన్నికల్లో దమ్ము కాదు... దుమ్ము లేపాలని అన్నారు. 

"కర్ణాటకలో నిరంతర విద్యుత్ ఇచ్చే దిక్కులేదు. అదే సమయంలో నిరంతర విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ. ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ లేదు" అని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సాయం పెంచుతోందని, పెన్షన్ ను వేల రూపాయల స్థాయికి తీసుకెళ్లింది తానేనని అన్నారు. పెన్షన్ ను దశలవారీగా రూ.5 వేలకు తీసుకెళతామని, రైతు బంధును కూడా దశలవారీగా రూ.12 వేలకు పెంచుతామని చెప్పారు. ఇదంతా ఎన్నికల కోసం చేయడంలేదని, పేదల కోసమే చేస్తున్నానని ఉద్ఘాటించారు. "రైతు బంధు అనే పదాన్ని, పథకాన్ని సృష్టించిందే నేను. గత ప్రభుత్వాలు ఇలాంటి పథకాలు ఇచ్చాయా? 93 లక్షల కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా చేస్తాం" అని వివరించారు. 

ఎన్నికల సమయంలో ప్రజలు ఆగం కావొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. వాళ్లూ వీళ్లూ చెప్పారని ఓటేయొద్దని, ఎవరివల్ల తెలంగాణ బాగుపడిందో చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారం మారితే మాత్రం తెలంగాణ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. మనకు కులమతాలు లేవు... ఉన్నది తెలంగాణ ఒక్కటేనని ఉద్ఘాటించారు.

More Telugu News