Thummala: నెల తర్వాత అధికారంలో ఉండనివారి కోసం జీవితం నాశనం చేసుకోవద్దు: అధికారులకు తుమ్మల హెచ్చరిక

  • పోలీసులను ప్రయివేటు సైన్యంలా మార్చారని బీఆర్ఎస్‌పై తుమ్మల ఆగ్రహం
  • తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకం చూడలేదని విమర్శ
  • బెదిరింపులు, దౌర్జన్యంతో కాంగ్రెస్ నేతలను భయపెడుతున్నారన్న తుమ్మల
Thummala Nageswara Rao warning to police officials

నెలరోజుల తర్వాత అధికారంలో ఉండని వారి కోసం అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీసులను ప్రయివేటు సైన్యంగా మార్చారని మండిపడ్డారు. గురువారం ఖమ్మంలో నిర్వహించిన ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతటి అరాచకం ఎన్నడూ చూడలేదన్నారు. పోలీసులను తమ ప్రయివేటు సైన్యంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.

బెదిరింపులు, దౌర్జన్యంతో కాంగ్రెస్ నేతలను భయపెడుతున్నారన్నారు. ఖమ్మంలో అరాచక పాలనను తరిమి కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కాలన్నారు. భారత్ జోడో యాత్రతో యావత్ దేశాన్ని ఐక్యంచేసిన రాహుల్ గాంధీ ఆహ్వానంతో తాను కాంగ్రెస్‌లో చేరానన్నారు. నియంతృత్వ రాజకీయాలకు ఇప్పుడు కాలం చెల్లిందన్నారు. కొంతమంది పోలీస్ అధికారులు పరిధి దాటి తమ పార్టీ వారిని ఇబ్బంది పెడుతున్నారన్నారు.

మరో నెల రోజుల తర్వాత అధికారంలో ఉండని వారి కోసం అధికారులు, పోలీసులు తమ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. పోలీస్ అధికారులు తమ పధ్ధతి మార్చుకోకపోతే ప్రజా తిరుగుబాటు చూస్తారని హెచ్చరించారు. అహంకార పాలనకు పాతరేసి ఖమ్మం అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ని గెలిపించాలని ప్రజలను తుమ్మల కోరారు.

More Telugu News