ndia Middle East Europe Economic Corridor: హమాస్ పరోక్ష లక్ష్యం భారత్ ప్రాజెక్టును దెబ్బకొట్టడమేనా?

  • ఇదే కారణమై ఉండొచ్చన్న అమెరికా అధ్యక్షుడు
  • ఎలాంటి కవ్వింపులు లేకుండా రెచ్చిపోయిన హమాస్ మిలిటెంట్లు
  • ఏకపక్షంగా ఇజ్రాయెల్ పై ముప్పేట దాడులు
  • భారత్-మిడిల్ ఈస్ట్, యూరప్ ప్రాజెక్టుకు వ్యతిరేకమన్న సందేహం
Biden speculates link between Hamas attack India Middle East Europe Economic Corridor

ఎలాంటి కవ్వింపులు లేవు. ఇజ్రాయెల్ దాడులు చేసింది లేదు. మరి పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు ఎందుకని మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డారు? అది కూడా ఎన్నడూ లేని విధంగా వేలాది క్షిపణులతో, భూమి, సముద్ర మార్గాల ద్వారా ఇజ్రాయెల్ లోకి చొరబడి కనిపించిన వారిని అంతమొందించడం వంటి క్రూరమైన దాడికి హమాస్ దిగడం, ఇజ్రాయెల్ తోపాటు. ప్రపంచదేశాలు నివ్వెరపోయేలా చేసింది. నిజానికి పాలస్తీనా ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రత్యేక దేశంగా లేదు. వారికంటూ సరిహద్దులతో కూడిన ప్రత్యేక దేశం డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కానీ, ఇప్పుడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడికి దిగడం వెనుక ఆంతర్యం ఏంటి..?


దీనికి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చూచూయగా ఓ సంకేతం ఇచ్చారు. ఇటీవలే ఢిల్లీ వేదికగా జరిగిన జీ-20 దేశాల సదస్సులో.. భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనమిక్ కారిడార్ ను ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. అంటే భారత్, మిడిల్ ఈస్ట్, యూరప్ ప్రాంతాలను రైలు, రోడ్డు మార్గాలతో అనుసంధానించడం, తద్వారా ఆర్థికాభివృద్ధిని పెంచుకోవడం దీని లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్టులో ఇజ్రాయెల్ కూడా భాగంగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అంగీకారం కుదరడమే, ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు దాడికి పాల్పడడం వెనుక కారణమై ఉండొచ్చని జో బైడెన్ పేర్కొన్నారు. తన సహజ విశ్లేషణ ఆధారంగానే ఇది చెబుతున్నాను తప్ప, దీనికి తన వద్ద ఆధారాల్లేవని కూడా బైడెన్ స్పష్టం చేశారు. 

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అమెరికాకు వచ్చిన సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో జోబైడెన్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇజ్రాయెల్ తో ప్రాంతీయ అనుసంధానతకు సంబంధించిన ప్రాజెక్టులో మేము పురోగతి సాధించడం వల్లే హమాస్ మిలిటెంట్లు దాడికి దిగారన్న కారణంతో నేను ఏకీభవిస్తున్నాను’’ అని బైడెన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇది కార్యరూపం దాలిస్తే భారత్, ఇజ్రాయెల్, యూరప్ దేశాలకు మరింత మేలు చేయనుంది. ఇజ్రాయెల్ కు - గల్ఫ్ దేశాలకు మధ్య దూరం పెంచడం ద్వారా, ప్రాజెక్టును దెబ్బకొట్టాలన్న వ్యూహం కూడా హమాస్ దాడుల వెనుక ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News