Bloodbath: భారీ అమ్మకాలతో కుదేలవుతున్న మార్కెట్లు.. షేర్లు కకావికలం

  • ఈ నెలలో నిఫ్టీ 1,000 పాయింట్లు, సెన్సెక్స్ 2,600 పాయింట్ల క్షీణత
  • గాజా-ఇజ్రాయెల్ యుద్ధం, అమెరికాలో పెరిగిపోతున్న వడ్డీ రేట్లు ఓ కారణం 
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు లాభాల స్వీకరణ
  • భారీగా అమ్మకాలు సాగిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు
Bloodbath on D Street Why Sensex tumbled over 800 points today

భారత ఈక్విటీ మార్కెట్లు అమ్మకాల తాకిడికి కుదేలవుతున్నాయి. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో అమ్మకాలకు పాల్పడుతున్నారు. దీనికి అంతర్జాతీయ పరిణామాలే కీలకంగా పనిచేస్తున్నాయి. అక్టోబర్ లో సెన్సెక్స్ 2,600 పాయింట్లు పడిపోగా, అటు నిఫ్టీ సైతం సుమారు 1,000 పాయింట్లు కోల్పోయింది. శాతం వారీగా చూస్తే మార్కెట్లో దిద్దుబాటు 5 శాతం వరకే ఉంది. కానీ విడిగా స్టాక్స్ ను పరిశీలిస్తే ఈ కరెక్షన్ 20-30 శాతం వరకు ఉంటోంది.


గురువారం సైతం సెన్సెక్స్ ఇంట్రాడేలో 800 పాయింట్లకు పైగా పడిపోగా, ఇన్వెస్టర్ల సంపద (వాటాల విలువ) రూ.5 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. బ్లూచిప్ కంపెనీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల్లో కరెక్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇవి భారీగా ర్యాలీ చేయడం వల్లే ఈ పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. దాదాపు అన్ని రంగాల షేర్లకు అమ్మకాల ఒత్తిడి తప్పలేదు.

నిజానికి ప్రపంచ మార్కెట్లు ఈ ఏడాది మొత్తం మీద నష్టాలనే చవి చూశాయి. కానీ, మన మార్కెట్లు బలంగా నిలబడ్డాయి. ఏటికి ఎదురీదుతున్నట్టుగా, మన మార్కెట్లు గరిష్ఠ వ్యాల్యూషన్ల వద్దే ట్రేడవుతున్నాయి. మరోవైపు అమెరికా బాండ్ ఈల్డ్స్ 17 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ తో ముగిసిన త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఫలితాలు నిరుత్సాహపరిచాయి. వీటికి గాజా-ఇజ్రాయెల్ యుద్ధం కూడా తోడైంది. ఈ యుద్ధం మరిన్ని దేశాలకు విస్తరిస్తుందేమోనన్న సందేహం విదేశీ ఇన్వెస్టర్లను వేధిస్తోంది. ఎందుకైనా మంచిదనే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారు ఈక్విటీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. 

దేశాల మధ్య ఘర్షణాత్మక వైఖరితో చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. చమురు ధరలు మరింత పెరిగితే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. గత రాత్రి నాస్ డాక్ 2.4 శాతం పడిపోగా, జపాన్ నికాయ్ సైతం 2 శాతం నష్టాన్ని చవిచూసింది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, మరో ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల పవనాలు ఏర్పడితే, పండుగల వాతావరణం మద్దతుతో మార్కెట్లు కాస్త కుదుటపడొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. 2-3 ఏళ్ల కోసం ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడానికి ఇప్పుడు అనుకూల సమయంగా నిపుణులు సూచిస్తున్నారు.

More Telugu News