Snail: ఉయ్యూరులో ప్రమాదకరమైన నత్తల పెంపకం.. ఒక్కటి బయటపడ్డా పంటలు నాశనమే..!

  • 50 సెంట్లలోని పంటను ఒకే ఒక నత్త నాశనం చేస్తుందంటున్న నిపుణులు
  • థాయ్ లాండ్ నత్తలను దేశంలోకి తీసుకురావడంపై కేంద్రం బ్యాన్
  • విశ్వశాంతి విద్యాసంస్థల ఆవరణలో పెంచుతున్న యజమాని
Banned Thailand Snail Farming Raise Concern In Vuyyuru

దేశంలో నిషేధిత నత్తలను ఆంధ్రప్రదేశ్ లోని ఉయ్యూరులో ఓ వ్యక్తి పెంచడం కలకలం సృష్టిస్తోంది. థాయ్ లాండ్ నత్తలు చాలా ప్రమాదకరమని, ఒక్కోటీ దాదాపు 50 సెంట్ల పొలంలోని పంటను నాశనం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నత్తలను ఉయ్యూరులోని విశ్వశాంతి విద్యాసంస్థల చైర్మన్ కుమారుడు మాదాల చంద్రశేఖర్ పెంచుతున్నారు. థాయ్ లాండ్ నుంచి వాటిని తెప్పించి విద్యాసంస్థల ఆవరణలోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి పెంపకం చేపట్టారు. దీనికి సంబంధించి ఓ వీడియోను యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో చూసిన బయాలజీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు చేపట్టారు. 

విశ్వశాంతి విద్యాసంస్థల ఆవరణలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రత్యేకంగా ట్యాంకుల్లో పెంచుతున్న నత్తలను, పెంపకం పద్ధతులను పరిశీలించారు. అందులోని నత్తలు నిషేధిత జాబితాలోనివి కావడంతో కేసు నమోదు చేశారు. థాయ్ లాండ్ నుంచి వాటిని తీసుకువచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రమాదకరమైన ఈ నత్తలను దేశంలోకి ఎలా తీసుకువచ్చారు..? సెక్యూరిటీ తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ నత్తలను ఎందుకు పెంచుతున్నారు.. ఏ దేశానికి ఎగుమతి చేస్తారనేది కూడా విచారిస్తున్నారు. కాగా, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసు అధికారులు చెప్పారు.

More Telugu News