Revanth Reddy: ఆరు హామీలతో కాంగ్రెస్ జోష్.. ఏడో హామీని తెరపైకి తెచ్చిన రేవంత్‌రెడ్డి

PCC Chief Revanth Reddy Announce Another Promise
  • కేసీఆర్‌పై మరోమారు విమర్శలు గుప్పించిన రేవంత్
  • స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయని ఆవేదన
  • తాము అధికారంలోకి వస్తే ఈ మూడింటినీ తిరిగి తీసుకొస్తామన్న రేవంత్
  • దీనిని ఏడో హామీగా అమలు చేస్తామన్న పీసీసీ చీఫ్
తెలంగాణలో జోష్ మీదున్న కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు హామీలు ప్రజల్లో చర్చనీయాంశమై ఆ పార్టీకి మరింత మైలేజీ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ హామీలకు మరోటి చేర్చినట్టు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

కేసీఆర్ హయాంలో ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం లేకుండా పోయాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఈ మూడింటినీ తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాము ప్రకటించిన ఆరు హామీలకు తోడుగా దీనిని ఏడో హామీగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పాలమూరు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని చాటిచెప్పేందుకే కొడంగల్ నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరినట్టు తెలిపారు. 

అది గతించిన ముచ్చట
కాంగ్రెస్ పార్టీ తరచూ ముఖ్యమంత్రులను మార్చుతుందన్న విమర్శలపైనా రేవంత్ స్పందించారు. పార్టీలో ప్రస్తుతం అలాంటి వైఖరి లేదని, అది గతించిన విషయమని చెప్పారు. అవసరమైతే ప్రభుత్వాలను వదులుకుంటుంది తప్ప పార్టీలోని అసమ్మతి గొంతులకు అధిష్ఠానం తలొగ్గబోదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌, కర్ణాటకను ఉదాహరణగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని మార్చాలన్న జ్యోతిరాదిత్య సింధియా ఒత్తిడి చేస్తే ఆయననే వదులుకొందని, అంతకుముందు కర్ణాటకలోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని వదులుకున్నామని రేవంత్ గుర్తు చేశారు. పార్టీలోని వివిధ వర్గాలు సీఎం పదవిని ఆశించడం తప్పేముందని రేవంత్ ప్రశ్నించారు.
Revanth Reddy
Telangana
Congress

More Telugu News