Uttar Pradesh: ఇంట్లోనే నాటువైద్యం.. కుక్క కరిచిన 15 రోజులకే బాలిక మృతి

Girl dies of rabies 15 days after dog bite in Agra
  • ఆగ్రాలో విషాదం.. రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి
  • కుక్క కరిచాక హాస్పిటల్‌కు తీసుకెళ్లని వైనం
  • లక్షణాలు కనిపించాక తీసుకెళ్లినా దక్కని ప్రయోజనం
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. కుక్క కాటుకు గురయ్యిన 8 ఏళ్ల పూనమ్ అనే బాలికకు ఇంటి వద్దే నాటువైద్యం అందించడంతో ప్రాణాలు కోల్పోయింది. శునకం కరిచిన 15 రోజుల తర్వాత రేబిస్‌తో చిన్నారి చనిపోయింది. ఆగ్రా జిల్లా పినహత్‌ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో రెండు వారాలక్రితం ఓ గ్రామంలో ఆడుకుంటున్న సమయంలో పూనమ్‌పై వీధి కుక్క దాడి చేసింది. బాలిక మృతిపై ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే శ్రీవాస్తవ వివరాలు వెల్లడించారు. బాలిక కుక్క కరిచిన విషయాన్ని తన తల్లికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదన్నారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ARV) ఇప్పించకుండా ఇంటి వద్దే ఉంచి నాటు వైద్యాన్ని అందించారని తెలిపారు.

బాలికకు 15 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపించడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారని శ్రీవాస్తవ వెల్లడించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా మారిన తర్వాత ఆస్పత్రికి తీసుకొచ్చారని, తీవ్రత గుర్తించి మెరుగైన వసతులున్న హాస్పిటల్ తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. రేబిస్‌ వ్యాధికి 100 శాతం మరణాల రేటు ఉందని హెచ్చరించిన ఆయన.. కుక్క కరిస్తే ఏమాత్రం అలసత్వం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కుక్క కరిచిన 24 గంటల్లోగా ఏఆర్‌వీ మొదటి డోస్ ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. కాగా.. అధికారిక లెక్కల ప్రకారం ఆగ్రాలో కుక్కకాటు ఘటనలు గణనీయంగా నమోదవుతున్నాయి.
Uttar Pradesh

More Telugu News